Hydra Demolitions : హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు, 8 ఎకరాల భూమి స్వాధీనం
22 September 2024, 17:50 IST
- Hydra Demolitions : హైదరాబాద్ లోని అమీన్ పూర్, పటేల్ గూడ, కూకట్ పల్లి పరిధిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసింది. ఈ కూల్చివేతలతో సుమారు 8 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది.
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు, 8 ఎకరాల భూమి స్వాధీనం
Hydra Demolitions : హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా కొనసాగిస్తుంది. ఆదివారం అమీన్ పూర్, పటేల్ గూడ, కూకట్ పల్లి పరిధిలో పలు అక్రమ నిర్మాణాలను కూల్చవేసింది. తాజా కూల్చివేతలపై హైడ్రా ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కీలక ఆపరేషన్ చేపట్టింది. ఈ కార్యక్రమం రెండు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందని తెలిపింది.
కూకట్ పల్లి లేక్/నల్లచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ పరిధిలో వాణిజ్య కార్యకలాపాల కోసం నిర్మించిన షెడ్లను హైడ్రా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా, కొంతమంది వ్యక్తులు కూకట్ పల్లి లేక్ వెంబడి క్యాటరింగ్ వ్యాపారాలు వంటి విస్తృతమైన వాణిజ్య కార్యకలాపాల కోసం పెద్ద షెడ్లను నిర్మించారు. వీటిలో వంట ఆర్డర్ల కోసం పెద్ద కిచెన్లు ఉన్నాయి. ఈ కార్యకలాపాలతో సంబంధం ఉన్న కార్మికులు అక్కడే నివసిస్తున్నారు. ఆ నిర్మాణాలను తొలగించింది. అయితే నివాసం కోసం ఏర్పాటు చేసుకున్న భవనాలను హైడ్రా లక్ష్యంగా చేసుకోదని ప్రకటించింది.
అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేట, పటేల్ గూడలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాల కోసం నిర్మాణాలు నిర్మించారని హైడ్రా తెలిపింది. ఈ కీలకమైన జలవనరులు, ప్రభుత్వ భూముల కాపాడేందుకు వీటిని కూల్చివేసినట్లు తెలిపారు.
కూల్చివేతల వివరాలు :
1. కూకట్ పల్లి లేక్/ నల్లచెరువు (మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు)
కూకట్ పల్లి విలేజ్, బాలానగర్ మండల పరిధిలోని సర్వే నంబరు 66,67,68,69 కూల్చివేతలు: 16 (వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడలు),
సేకరించిన విస్తీర్ణం : 4 ఎకరాలు
2. కిష్టారెడ్డిపేట : ప్రభుత్వ భూమిలో ఆక్రమణల తొలగింపు, సర్వే నంబరు 164, కిష్టారెడ్డిపేట గ్రామం, అమీన్ పూర్ మండల నిర్మాణాలు: 3 ఆర్ సీసీ నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఒక ఎకరం విస్తీర్ణ భూమి స్వాధీనం చేసున్నామని హైడ్రా ప్రకటించింది.
3. పటేల్ గూడ : ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించారు. సర్వే నంబర్ 12/2,12/3, పటేల్ గూడ గ్రామం, అమీన్ పూర్ మండల నిర్మాణాలు: 25 ఆర్ సీసీ నిర్మాణం (గ్రౌండ్ ఫ్లోర్లు, ఒక పై అంతస్తు భవనాలు)
సేకరించిన విస్తీర్ణం: 3 ఎకరాలు
ఈ ఆక్రమణలను తొలగించడం ద్వారా హైడ్రా సుమారు 8 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. రెవెన్యూ శాఖ, నీటి పారుదల శాఖ, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, హైడ్రా బృందంతో కలిసి కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రయత్నం కీలకమైన నీటి వనరుల సంరక్షణ, సరైన నిర్వహణకు అవకాశం ఉంటుందని హైడ్రా ప్రకటించింది.