Hyderabad Musi River : ఆపరేషన్ మూసీ...! రంగంలోకి దిగనున్న హైడ్రా, నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు...?-the government is ready to remove the encroachments in the musi catchment areas ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Musi River : ఆపరేషన్ మూసీ...! రంగంలోకి దిగనున్న హైడ్రా, నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు...?

Hyderabad Musi River : ఆపరేషన్ మూసీ...! రంగంలోకి దిగనున్న హైడ్రా, నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు...?

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 22, 2024 10:49 AM IST

మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వాటిని తొలగించేందుకు రంగం సిద్ధమైంది. హైడ్రానే ఈ బాధ్యతలను చూడనుంది. ఇక్కడ ఉంటున్నవారికి పునరావాసం కల్పించే దిశగా కసరత్తు కూడా ప్రారంభమైంది.

మూసీ నది (ఫైల్ ఫొటో)
మూసీ నది (ఫైల్ ఫొటో) (Images source Twitter)

మూసీ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రాను తీసుకువచ్చింది. ఇప్పటికే పని మొదలుపెట్టిన హైడ్రా… ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన వాటిని కూల్చివేసింది. ప్రాంతాలవారీగా లెక్కలు తీస్తూ…. అక్రమణలను గుర్తించే పనిలో పడింది. ఇవాళ కూడా కూకట్ పల్లి ఏరియాలో కూల్చివేతలు చేపట్టింది.

మరోవైపు మూసీ పరీవాహక ప్రాంతంలో కూడా కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. మూసీ నదిని సుందీకరణ చేసే ప్రాజెక్టులో భాగంగా… అక్రమణలను తొలగించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ బాధ్యతలను కూడా హైడ్రానే చూడనుంది. ఇప్పటికే మూసీ ఆక్రమణలపై అధికారులు సర్వే నిర్వహించారు. మ్యాప్స్ పరిశీలించి… లెక్కలు తీశారు.

మూసీ పరివాహక ప్రాంతంలో 12 వేలకు పైగా ఆక్రమణలున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీటిని తొలగించాలని సర్కార్ నిర్ణయించింది. వీటి తొలగింపుతో చాలా మంది రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న సర్కార్… ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిపెట్టింది. వారికి పునరావాసం కింద డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని యోచిస్తోంది. దశల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన…!

మలక్ పేట నియోజకవర్గంలోని సైదాబాద్ పరిధిలోని ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పరిశీలించారు. పిల్లి గుడిసెలలో ఉన్న డబుల్ బెడ్రూంలు ఎన్ని..? ఇంకా పెండింగ్ వర్క్స్ ఏమున్నాయనే దానిపై ఆరా థీసారు. డబుల్ బెడ్రూం లలో ఉన్న గదులతో పాటు వంట రూం తదితర వాటిని పరిశీలించారు. ఇప్పటికే డబుల్ బెడ్రూం లలో నివాసం ఉంటున్న వారితో మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం… మూసీ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పర్యాటక , పారిశ్రామిక , పర్యావరణ ,నీటి ఇబ్బందులు లేకుండా అందమైన టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అయితే అక్రమణల తొలగింపుతో ఇబ్బందే పడే పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చే ఆలోచన ఉందన్నారు. వీలైనంత త్వరగా అందజేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని… ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపును కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు.

పునరావాసం కింద నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. అందరికీ రీహబిటేషన్ జరుగుతుందన్నారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత కథనం