Motkupalli On Jagan : చంద్రబాబు కుటుంబాన్ని చంపే ప్రయత్నం, మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు
24 September 2023, 16:32 IST
- Motkupalli On Jagan : చంద్రబాబుకు మద్దతుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టారు. గతంలో జగన్ కు సపోర్టు చేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నానన్నారు.
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
Motkupalli On Jagan : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ... మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఆయన దీక్ష కొనసాగనుంది. అయితే మోత్కుపల్లి దీక్షకు పోలీసులు గంట మాత్రమే అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ దీక్ష ప్రారంభానికి ముందు మోత్కుపల్లి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పై విమర్శలు చేశారు. గతంలో ఏపీలో జగన్ విజయం సాధించాలని కోరుతూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడానని గుర్తుచేసుకున్నారు. అప్పుడు అలా మాట్లాడినందుకు ఇప్పుడు సిగ్గుతో తలదించుకుంటున్నానన్నారు. గత ఎన్నికల్లో జగన్ విజయానికి సహకరించిన ప్రతీ ఒక్కరూ ఇవాళ తలదించుకొనే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు కుటుంబాన్ని చంపేందుకు కుట్ర జరుగుతోందన్నారు. చంద్రబాబు చనిపోతే తమకు ఎదురుండదని సీఎం జగన్ భావిస్తున్నారన్నారు. త్వరలో రాజమండ్రి వెళ్లి చంద్రబాబు కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం తెలుపుతానన్నారు.
వచ్చే ఎన్నికల్లో 4 సీట్లు
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మోత్కుపల్లి ఆరోపించారు. లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి, చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ను కూడా జగన్ అరెస్టు చేసేందుకు వెనుకాడరని మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేశారని మోత్కుపల్లి మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించిన ఆయన... సీఎం జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు నాలుగు సీట్లు కూడా రావని మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు.
సొంత చెల్లిని బయటకు పంపారు
స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంపై 2021లో కేసు నమోదైతే ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేని చంద్రబాబును నాలుగేళ్ల తర్వాత అరెస్ట్ చేయించిన ఘనత సీఎం జగన్ దేనని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. జగన్ విధానాలను చూసి ఏపీ ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కాపాడుకోలేని అసమర్థుడవని ఆరోపించారు. జగన్ నియంత అని పేరు తెచ్చుకున్నారన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయించి జగన్ ఏం ఆనందం పొందారో అర్థం కావడం లేదన్నారు. భువనేశ్వరి ఏడుపు జగన్‌కు తప్పక తగులుతోందన్నారు. సొంత చెల్లికి తండ్రి ఆస్తిలో భాగం ఇవ్వకుండా బయటకు పంపారని విమర్శించారు. జగన్ విజయం పాపంలో తనకూ భాగస్వామ్యం ఉందని అందుకు చింతిస్తున్నానన్నారు. జగన్ కళ్లకు అహంకార పొరలు కమ్ముకున్నాయని మండిపడ్డారు. సొంత బాబాయ్‌ని చంపిన నేరస్థుడిని పట్టుకోలేని వ్యక్తి సీఎం జగన్ అని విమర్శించారు.