TS Paddy Bonus : రూ.500 బోనస్ సన్న ధాన్యం నుంచి మొదలుపెట్టాం- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
21 May 2024, 15:39 IST
- TS Paddy Bonus : సన్న రకం ధాన్యానికి మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని అనలేదని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సన్న వడ్లతో బోనస్ ప్రారంభించామన్నారు.
రూ.500 బోనస్ సన్న ధాన్యం నుంచి మొదలుపెట్టాం- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
TS Paddy Bonus : తెలంగాణలో సన్న వడ్లకు బోనస్ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సోమవారం కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... సన్న వడ్లకే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు ధాన్యం పండిస్తారని, 10 శాతం మాత్రమే సన్న వడ్లు ఉంటాయన్నారు. బోనస్ ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ మాట మార్చిందని విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు కాంగ్రెస్ నేతలు చెక్ పెడుతున్నారు. ధాన్యం బోనస్ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. సన్న బియ్యానికే రూ. 500 బోనస్ అనలేదని, సన్నాలతో రూ.500 బోనస్ ప్రక్రియను మొదలు పెట్టామన్నారు. రైతులు ఆందోళన చెందొద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనుకూల నిర్ణయాలే తీసుకుంటుందన్నారు.
రైతుల పేరిట రాజకీయాలు
బీజేపీ, బీఆర్ఎస్ రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తడిసినా, మొలకెత్తిన ధాన్యం కూడా కొంటామన్నారు. రేటు తగ్గించకుండా ధాన్యం సేకరిస్తామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వరి వేస్తే ఊరే అని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. రైతుల్లో కాంగ్రెస్ కు మద్దతు పెరుగుతుండడంతో బీఆర్ఎస్ తట్టుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల అకౌంట్లలో నగదు జమ చేస్తు్న్నామన్నారు. ఇది ప్రతిపక్షాలకు మింగుడుపడడంలేదన్నారు. అందుకే బీఆర్ఎస్ రైతులను మభ్యపెడుతుందని విమర్శించారు. రైతులను ఇబ్బంది పెట్టేలా రాజకీయాలు సరికాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు.
15 రోజుల ముందుగానే కొనుగోళ్లు
రాష్ట్రంలో అసలు ధాన్యం కొనుగోలు చేయడంలేదని, కల్లాళ్లలోనే ధాన్యం తడిసిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. గతంలో కంటే 15 రోజుల ముందుగానే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ కేంద్రాల్లో 7,245 ధాన్యం కొనుగోళ్లను ప్రారంభినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ స్వార్థ రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తడిచిన వడ్లను కొనలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీస మద్దతు ధరకే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తు్న్నామన్నారు. రైతుల పేరుపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
రైతుల ఆందోళన
సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని పలు చోట్ల రైతుల ధర్నా చేశారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో అన్ని రకాల ధాన్యానికి, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న ధాన్యానికే ఇస్తామంటూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సన్న రకం ధాన్యం మార్కెట్‌కు రాదని ఎక్కువగా మిల్లులలోనే అమ్ముడు పోతుందన్నారు. ఎక్కువ శాతం రైతులు దొడ్డు వడ్లను పండిస్తుంటారన్నారు.