TG Pension Recovery : ఆసరా పెన్షన్ల రికవరీపై ప్రభుత్వం కీలక నిర్ణయం- నోటీసులు, రికవరీ ఆపాలని ఆదేశాలు
Updated Jul 14, 2024 10:20 PM IST
- TG Pension Recovery : అనర్హుల నుంచి సంక్షేమ పథకాల సొమ్ము రికవరీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రికవరీపై మార్గదర్శకాలు విడుదల చేసే వరకు నోటీసులు, రికవరీ ఆపాలని సీఎస్ ఆదేశించారు. ఈ విషయంపై అసెంబ్లీ చర్చించాలని నిర్ణయించారు.
ఆసరా పెన్షన్ల రికవరీపై ప్రభుత్వం కీలక నిర్ణయం- నోటీసులు, రికవరీ ఆపాలని ఆదేశాలు
TG Pension Recovery : సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న అనర్హులకు రికవరీ నోటీసులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులకు నోటీసులు, నగదు రికవరీ ప్రక్రియను ప్రస్తుతానికి ఆపాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి, నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని సీఎస్ తెలిపారు. అయితే త్వరలోనే అర్హులతే సంక్షేమ పథకాలతో లబ్ధి పొందేలా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. ఈ మార్గదర్శకాలు ఇచ్చే వరకు అనర్హులకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్లు
పేదలకు అందాల్సిన ఆసరా పెన్షన్లు దుర్వినియోగం అయినట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. కొందరు డబుల్ పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పింఛన్ పొందుతున్న వాళ్లు ఆసరా పింఛన్ పొందుతున్నట్లు అధికారులు దృష్టికి వచ్చింది. నిబంధనలు ప్రకారం రెండు పెన్షన్లు చట్ట విరుద్ధం. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణలో కొందరికి డబుల్ పెన్షన్లు ఇస్తున్నట్లు తెలియడంతో వారికి ఆసరా పెన్షన్ రద్దు చేయాలని, చట్ట విరుద్ధంగా పొందిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేయాలని ఆదేశించింది. అయితే ఈ వ్యవహారంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో రికవరీపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసే వరకు నోటీసులు ఇవ్వొద్దని సీఎస్ తాజగా ఉత్తర్వులు జారీ చేశారు.
5650 మందికి డబుల్ పెన్షన్లు
అధికార మార్పిడితో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 5650 మందికి డబుల్ పెన్షన్లు అందుతున్నట్లు సెర్ప్ తన నివేదికలో వెల్లడించడం గమనార్హం. ప్రభుత్వ సర్వీసులో పని చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత పొందుతున్న పెన్షన్ తో పాటు ఆసరా పెన్షన్ సైతం పొందుతున్న విడ్డూరం చోటు చేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలో 5650 మందికి డబుల్ పెన్షన్లు అందుతుండగా ఇందులో 3826 మంది చనిపోయారు. ఇక 1826 మంది ఇప్పటికీ రెండు పెన్షన్లను పొందుతున్నట్లు సెర్ప్ తన నివేదికలో వెల్లడించింది. దీంతో మేల్కొన్న ప్రభుత్వం జూన్ నెల నుంచి ఈ పెన్షన్లను నిలిపివేసింది.
రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఆగస్టు నుంచి ఆసరా పెన్షన్లను 4 వేలు, 6 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అక్రమంగా పొందుతున్న పెన్షన్లపై దృష్టి పెట్టింది. ఇలా అక్రమంగా పెన్షన్లు జారీ చేయడంలో కీలక పాత్ర పోషించిన అధికారులపై సైతం చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.