Hyderabad Crime : హైదరాబాద్ లో రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, నైజీరియన్ అరెస్ట్
06 February 2024, 19:56 IST
- Hyderabad Crime : ముంబయి, గోవాల నుంచి డ్రగ్స్ కొరియర్ సర్వీస్ ద్వారా తీసుకొచ్చి హైదరాబాద్ విక్రయిస్తున్న నైజీరియన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఓ గ్యాంగ్ ను ఫామ్ చేసి వారికి రెగ్యులర్ గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ లో రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
Hyderabad Crime : హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు, నైజీరియన్ దేశస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నుంచి పెద్ద మొత్తంలో హెరాయిన్, కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్(Hyderabad) లో అమ్ముతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ లో ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసి... వారికి రెగ్యులర్ గా నైజీరియన్ డ్రగ్స్ అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ దేశస్థుడు స్టాన్ లిని సోమవారం ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ ప్రాంతాల్లో కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నగరంలో రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
అనంతరం అతడి నుంచి 557 గ్రాముల కొకైన్,902 ఎక్స్టాసి పిల్స్,105 ఎల్ ఎస్డీ బ్లాట్స్, 215 గ్రాముల చరస్, 21 గ్రాముల హెరాయిన్ తో పాటు ఇతర డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.8 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముంబయి(Mumbai)లో బట్టల వ్యాపారం చేస్తానని 2009లో బిజినెస్ వీసా తో ఇండియాకు వచ్చిన నిందితుడు.....ఆ తర్వాత గోవాలో కొందరు నైజీరియన్లతో కలిసి డ్రగ్ సరఫరా దందా మొదలు పెట్టాడని పోలీసులు పేర్కొన్నారు. వీసా ఎంక్వైరీ కేసులో ఆరు నెలల పాటు నిందితుడు గోవా జైల్లో ఉన్నాడని, 2017లో డ్రగ్ సప్లై చేస్తుండగా నార్కోటిక్స్ బ్యూరోకు పట్టుబడినట్లు పోలీసులు వివరించారు. ముంబయి, గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకొని హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కొరియర్ సర్వీసెస్ ద్వారా డ్రగ్స్ తెప్పించి
కొరియర్ సర్వీసెస్ ద్వారా నిందితుడు స్టానీ డ్రగ్స్ తెప్పించే వాడని....గతంలో ఎస్ఆర్ నగర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నిందితుల ద్వారా ఇతని గురించి తెలుసుకున్నామని.....అప్పటి నుంచి నిందితుడి పై నిఘా పెట్టామని అధికారులు చెప్పారు. ఇతనికి దేశవ్యాప్తంగా 500 మంది కస్టమర్లు ఉన్నారని.. హైదరాబాద్ నుంచి ఏడుగురు కస్టమర్లకు రెగ్యులర్ గా డ్రగ్ సప్లై చేస్తున్నాడని వివరించారు. హైదరాబాద్ నగరంలోని ప్రతీ పబ్(Pub), రెస్టారెంట్ లో కట్టు దిట్టమైన నిఘా ఉంచామని, డ్రగ్స్ సప్లై చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్(Drugs) గురించి ప్రజలకు ఏలాంటి సమాచారం అందినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
అనుమతి లేని ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
రోగులకు సర్జరీ కోసం అత్యవసర సమయంలో వినియోగించే ఇంజక్షన్లను ఎలాంటి అనుమతులు లేకుండా మార్కెట్ లో విక్రయిస్తున్న ఇద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 30 ఇంజక్షన్ బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు.మెఫెంట్ర్మినే సల్ఫేట్ ఇంజక్షన్లను కార్డియాక్ సర్జరీ సమయంలో రోగులకు వాడుతూ ఉంటారు. వీటిని కొంతమంది బాడీ బిల్డర్లు తమ కండలు కనిపించడానికి వినియోగిస్తుంటారు. దీని కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి అందు వల్లనే అనుమతి లేకుండా ఈ ఇంజెక్షన్లను అమ్మారాదు.అయితే పహాడ్ షరీఫ్ ప్రాంతానికి చెందిన మొయినుద్దీన్ ఏసి టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఈ ఇంజక్షన్ వాడకంపై అవగాహన ఉన్న మొయినుద్దీన్ మరో వ్యక్తితో కలిసి మార్కెట్లో ఆ ఇంజెక్షన్లకు ఉన్న డిమాండ్ గమనించి వాటిని విక్రయించేందుకు నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యంలోనే సోమవారం వీరిద్దరూ.... సంఘీ గూడ చౌరస్తా వద్ద ఇంజక్షన్ విక్రయించేందుకు నిలబడ్డారు. పక్కా సమాచారం అందుకున్న శంషాబాద్(Shamshabad) పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 4000 నగదును, వారి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 27000 లను సీజ్ చేశారు. ఒక్కో ఇంజక్షన్ రూ. 200 కు కొనుగోలు చేసి......రూ. 1500 నుంచి 2000 విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టర్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా