తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Annual Crime Report : 2024లో పెరిగిన హైదరాబాద్ క్రైమ్ రేట్, రూ.297 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Hyderabad Annual Crime Report : 2024లో పెరిగిన హైదరాబాద్ క్రైమ్ రేట్, రూ.297 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

22 December 2024, 18:34 IST

google News
  • Hyderabad Annual Crime Report : 2024లో హైదరాబాద్ క్రైమ్ రేటు కాస్త పెరిగిందని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 35,944 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని తెలిపారు. రూ.297 కోట్లు సైబర్ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్నారన్నారు.

2024లో పెరిగిన హైదరాబాద్ క్రైమ్ రేట్, రూ.297 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
2024లో పెరిగిన హైదరాబాద్ క్రైమ్ రేట్, రూ.297 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

2024లో పెరిగిన హైదరాబాద్ క్రైమ్ రేట్, రూ.297 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Hyderabad Annual Crime Report : 2024 ఏడాది చాలా ప్రశాంతంగా గడిచిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. నగర పరిధిలో అన్ని పండగలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. నగర భద్రత కోసం హోంగార్డు నుంచి సీపీ వరకు అందరూ ఎంతో కష్టపడ్డారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ క్రైమ్ రేటు ఈ ఏడాది కాస్త పెరిగిందని సీపీ వెల్లడించారు. క్రైమ్ జరిగితే 7 నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే సంఘటనా స్థలానికి చేరుకుంటున్నామన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 129 పెట్రోల్ కార్లు, 210 బ్లూ కోల్ట్స్ వాహనాలు, ఇంటర్ సెట్టర్ వాహనాలు నిరంతరం పోలీసింగ్‌లో భాగస్వామ్యం అయ్యాయన్నారు.

రూ.297 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

2024లో మొత్తం 35,944 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గత ఏడాది కంటే ఈసారి 45 శాతం ఎఫ్ఐఆర్ పెరిగాయన్నారు. హత్యలు 13 శాతం తగ్గాయని, అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా తగ్గాయని సీపీ వెల్లడించారు. కిడ్నాప్ కేసులు 88 శాతం, ఆస్తి వివాద కేసులు 67 శాతం పెరిగాయన్నారు. 36 రకాల సైబర్ నేరాలు ఈ ఏడాది చూశామన్నారు. నేరాలను గుర్తించడం 59 శాతం, రికవరీ పర్సెంటేజ్ 58 శాతం ఉందన్నారు. సైబర్ నేరాల్లో డిజిటల్ అరెస్టులు ఎక్కువ శాతం రిపోర్టు అవుతున్నాయన్నారు. కమిషనరేట్ పరిధిలో 4042 సైబర్ క్రైమ్‌ కేసులు నమోదు అయ్యాయన్నారు. సైబర్ క్రైమ్ లో పెట్టుబడుల పేరిట మోసాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రూ.297 కోట్లు సైబర్ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్నారని, రూ.42 కోట్లు రికవరీ చేశామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 500 మంది కన్నా ఎక్కువ సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేశామన్నారు.

నేరాలను గుర్తించడంలో సీసీటీవీలు కీలకం

హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు తర్వాత సౌండ్ పొల్యూషన్ నియంత్రణలో భాగంగా డీజేలపై నిషేధం విధించామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ముత్యాలమ్మ గుడి వివాదం అనంతరం నిరాశ్రయులను షెల్టర్ హోమ్‌కు తరలించామన్నారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఆపరేషన్ రోప్‌ను విస్తృతం చేశామన్నారు. జీహెచ్ఎంసీ, లా అండ్ ఆర్డర్ పోలీసుల సాయంతో ఆపరేషన్ రోప్‌ను విస్తృతంగా చేపట్టామన్నారు. రౌడీలపై టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతోందన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కట్టిడికి టాస్క్ ఫోర్స్ చర్యలు చేపడుతోందన్నారు. నేరాలు గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతో కీలకంగా మారాయన్నారు. అలాగే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ నిర్వహణకు డ్రోన్లను ఉపయోగిస్తున్నామన్నారు. 30 మంది పోలీసులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారని, వారిని సస్పెండ్ చేసి కేసులు నమోదు చేశామన్నారు.

తదుపరి వ్యాసం