తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Real Estate Fraud :రియల్ ఎస్టేట్ పై యూట్యూబ్ లో సలహాలు, నమ్మించి రూ. 10 కోట్లు దోచేసిన కుటుంబం

Real Estate Fraud :రియల్ ఎస్టేట్ పై యూట్యూబ్ లో సలహాలు, నమ్మించి రూ. 10 కోట్లు దోచేసిన కుటుంబం

HT Telugu Desk HT Telugu

12 June 2024, 22:08 IST

google News
    • Real Estate Fraud : రియల్ ఎస్టేట్ లాభాలంటూ యూట్యూబ్ ఛానెల్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఓ కుటుంబాన్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 40 మంది బాధితులు అధిక లాభాలు వస్తాయని ఆశపడి రూ.10 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయారు.
రియల్ ఎస్టేట్ పై యూట్యూబ్ లో సలహాలు, నమ్మించి రూ. 10 కోట్లు దోచేసిన కుటుంబం
రియల్ ఎస్టేట్ పై యూట్యూబ్ లో సలహాలు, నమ్మించి రూ. 10 కోట్లు దోచేసిన కుటుంబం

రియల్ ఎస్టేట్ పై యూట్యూబ్ లో సలహాలు, నమ్మించి రూ. 10 కోట్లు దోచేసిన కుటుంబం

Real Estate Fraud : రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎలా రాణించాలి? పెట్టుబడులు ఎలా పెట్టాలి? ఎలా సంపాదించాలి? అంటూ యూట్యూబ్ ఛానెల్ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ దాదాపు 40 మంది నుంచి రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేసిందో ఓ కుటుంబం. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మంగళవారం కుటుంబం మొత్తాన్ని అరెస్ట్ చేశారు. మైళ్ళ శివయ్య అలియాస్ శివ కుమార్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్, ఆరోగ్యానికి సంబంధించి యూట్యూబ్ ఛానెల్ లో మీమాంస, రీబూట్ పేరుతో ప్రకటనలు, ప్రసంగాలు ఇస్తుంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వారికి శిక్షణ ఇస్తానని, తద్వారా వారు తమ పెట్టుబడికి తక్కువ సమయంలో అధిక లాభాలు సంపాదించవచ్చు అని ప్రచారం చేశాడు. అంతేగాక శివయ్య అలియాస్ శివ కుమార్ తన భార్య స్వర్ణలత, కుమారుడు జశ్వంత్ తో కలిసి ఆన్ లైన్ తో పాటు ఇండోర్ సమావేశాలు నిర్వహించేవారు. ఇలా శిక్షణకు హాజరు అయ్యే వారి నుంచి రూ.లక్ష చొప్పున వసూల్ చేసే వారు. ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో బ్యాంక్ వేలం ఆస్తులు, కమర్షియల్ భూములపై పెట్టుబడి పెడితే అతి తక్కువ రోజుల్లోనే అధిక లాభాలు పొందొచ్చని నమ్మించి బాధితుల ద్వారా పెట్టుబడులు పెట్టించాడు.

40 మంది నుంచి రూ.10 కోట్లు

అతడి మాయ మాటలు నమ్మి దాదాపు 40 మంది బాధితులు రూ.10.86 కోట్లు పెట్టుబడి పెట్టి మోసపోయారు. ఇదే కాకుండా యూట్యూబ్ లో తనకు తాను ఓ ప్రకృతి వైద్యుడిగా, న్యూరో లింగ్విస్ట్ ప్రోగ్రాం ట్రైనర్ గా చెప్పుకుంటూ, బీపీ, షుగర్, క్యాన్సర్ తదితర వ్యాధులను తక్కువ కాలంలోనే నయం చేస్తానని నమ్మించి పలువురిని మోసం చేశాడు. దీంతో బాధితుల ఫిర్యాదులతో ఎల్బీ నగర్, బాచూపల్లి, మియాపూర్, సీసీఎస్ పోలీస్ స్టేషన్ లలో శివయ్యపై కేసులు నమోదు చేశారు. శివయ్యకు సహకరిస్తున్న భార్య స్వర్ణలత, కుమారుడు జశ్వంత్, మరొక న్యాయవాదిపై కూడా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.

గతంలోనూ ఇవే మోసాలు

అయితే శివయ్య గతంలోనూ ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ పై 88 రోజుల పాటు చంచల్ గూడ జైల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శివయ్యతో పాటు కుమారుడు జశ్వంత్ కూడా కొన్ని రోజులు జైలుకు వెళ్లి వచ్చాడు. నిందితులకు సంబంధించి అన్ని బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి వారి ఆస్తులను అటాచ్ చేసినట్టు పోలిసులు పేర్కొన్నారు. జైలు నుంచి బెయిల్ పై విడుదల అయిన తరువాత కూడా శివయ్య మళ్లీ పాత పంథాను అనుసరిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ తరహా పెట్టుబడి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీసీఎస్ డీసీపీ శ్వేత సూచించారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం