High BP and Sleeping: తక్కువ గంటలు నిద్రపోతున్నారా? హై బీపీ వచ్చేస్తుంది జాగ్రత్త
High BP and Sleeping: నిద్రా, ఆహారం... ఈ రెండే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఈ రెండూ సవ్యంగా లేకపోతే హై బీపీ, మధుమేహం వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది.
High BP and Sleeping: తగినంత నిద్ర పొమ్మని వైద్యులు చెబుతూనే ఉంటారు. అయినా కూడా ఫోన్లు, టీవీలు చూస్తూ అర్ధరాత్రి వరకు గడిపేసేవారు ఎంతోమంది. అలాంటి వారికి ఇదొక హెచ్చరిక. తక్కువ గంటల నిద్రపోతే హై బీపీ, మధుమేహం వంటి రోగాలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. కాబట్టి నిద్రను తగ్గించుకోవడం మాని... కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఎనిమిది గంటల నిద్ర సమతుల్యమైన ఆహారం ఎన్నో రోగాలను రాకుండా అడ్డుకుంటాయి.
శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. కానీ ఎంతో మంది నిద్రను తగ్గించుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ ప్రభావం శరీరం మీద పడుతుంది. మొత్తం ఆరోగ్యమే తలకిందులు అవుతుంది. సరైన నిద్ర లేకపోతే ఆహారం కూడా తినాలనిపించదు. నిద్రకు విలువ ఇవ్వని మనిషి ఆరోగ్యంగా జీవించటం చాలా కష్టం. కాబట్టి ప్రతిరోజు ఎనిమిది గంటలకు తగ్గకుండా రాత్రి నిద్ర ఉండేలా చూసుకోండి. 20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కూడా 8 గంటల పాటు నిద్రపోవాలి.
హైబీపీ రాకుండా ఉండాలంటే...
ఆధునిక కాలంలో అధిక రక్తపోటు, మధుమేహం వంటి రోగాలు ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే నిద్రలేమి సమస్య కూడా అధిక శాతం మందిలో ఉంది. నిజానికి నిద్రలేమి వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. నిద్ర పట్టకపోవడం వల్ల ఒత్తిడి హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఈ ఒత్తిడి హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం వల్ల రక్తపోటు కూడా పెరిగిపోతుంది. ఇలా దీర్ఘకాలంగా జరిగితే హైబీపీ బారినపడి మందులు వాడాల్సి వస్తుంది. రక్తనాళాలు బిగుసుకుపోతాయి. ఆ సమయంలో రక్త ప్రవాహం సరిగా జరగక రక్తపోటు పెరిగిపోతుంది. రక్తనాళాలు లోపలి పొరలు కూడా నిద్రలేమి వల్ల దెబ్బతింటాయి.
హైబీపీ బారిన పడకుండా ఉండాలంటే ముందు నుంచే సమతుల్యమైన ఆహారాన్ని తింటూ, తగిన సమయానికి తగినంత నిద్ర చేయడం చాలా అవసరం. దీనివల్ల హై బీపీ అదుపులో ఉండటమే కాదు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. కాబట్టి మధుమేహం వంటి రోగాలు రాకుండా ఉంటాయి.
నిద్రలేమి ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. నిద్రలేమి వల్ల కిడ్నీల పనితీరు మారిపోతుంది. కిడ్నీలు ఎప్పుడైతే సరిగ్గా పని చేయవో అప్పుడు హైబీపీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నిద్రకు ప్రాధాన్యతను ఇవ్వండి. నిద్ర కిడ్నీల ఆరోగ్యాన్ని, గుండె ఆరోగ్యాన్ని, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. నిద్ర వచ్చే పరిస్థితులను ఇంట్లోనే మీరే కల్పించుకోవాలి. ముందుగా మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే అధిక సమయం పాటు నిద్ర పడుతుంది. దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
ఆహారంలో పండ్లు, కాయగూరలు, లీన్ ప్రొటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. అల్పాహారంలో ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలను తినాలి. కోడిగుడ్లను బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకుంటే మంచిది. బ్రేక్ ఫాస్ట్ లో ప్రొటీన్ ఆహారం తినడం వల్ల ఆ రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా సాగుతుంది.