Hyderabad Rains : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం - ‘హైడ్రా’ నుంచి కీలక అలర్ట్
20 September 2024, 22:36 IST
- హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురుసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల రహదారులన్నీ జలమయం అయ్యాయి. వచ్చే మూడో రోజులపాటు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుసింది. శుక్రవారం సాయంత్రం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, తార్నాక, నాగోల్, బోడుప్పల్, బాలానగర్, జీడిమెట్ల, నాంపల్లి, హయత్‌నగర్‌తో పాటు పలు శివారు ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. దీంతో చాలా చోట్ల రహదారులన్నీ జలమయమయ్యాయి.
బీ అలర్ట్…!
శుక్రవారం అర్ధరాత్రి తర్వాత నగరంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. GHMC-DRF సాయం కోసం 040-21111111 లేదా 9000113667 నెంబర్లను సంప్రదించవచ్చని ఓ ప్రకటనలో తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వచ్చే మూడో రోజులు భారీ వర్షాలు!
మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 21వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
సెప్టెంబర్ 22వ తేదీన ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.