తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kakatiya University Vc : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ - సర్కార్ ఆదేశాలు

Kakatiya University VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ - సర్కార్ ఆదేశాలు

19 May 2024, 6:28 IST

google News
    • Vigilance Inquiry On KU VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యునివర్సిటీ టీచర్స్ ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన సర్కార్…. తాజ ఆదేశాలను జారీ చేసింది.
కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ
కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ

కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ

Vigilance Inquiry On KU VC : కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేషం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీకి శనివారం ఆదేశాలు జారీ చేశారు. 

కేయూ వీసీగా నియామకం అయినప్పటి నుంచి ప్రొఫెసర్ తాటికొండ రమేష్ చేసిన అక్రమాలపై ఇప్పటికే అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్) పలుమార్లు ఫిర్యాదు చేయగా, స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఎంక్వైరీ చేపట్టేందుకు విజిలెన్స్ కు ఆర్డర్స్ ఇచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించడంతో కేయూ ఉద్యోగ సంఘాల నేతలు, స్టూడెంట్ యూనియన్ లీడర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి నుంచీ వివాదాలే…!

రాష్ట్రంలో ఉస్మానియా తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్నది కాకతీయ యూనివర్సిటీ. కేయూ వీసీగా మూడు సంవత్సరాల కిందట పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ తాటికొండ రమేష్ అనేక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. వీసీగా పోస్టింగ్ కు ప్రొఫెసర్ గా పదేళ్ల అనుభవం అవసరం అయినప్పటికీ తనకున్న పరిచయాలతో వైస్ ఛాన్స్ లర్ గా పోస్టింగ్ తెచ్చుకున్నారనే ఆరోపణలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. దీంతో కొంతమంది కోర్టుకు వెళ్లగా.. ఆ కేసు ఇంకా నడుస్తుంది. 

వీసీ రమేశ్ రూల్స్ కు విరుద్ధంగా సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ పొందారనే ఆరోపణలున్నాయి. 2022లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన వీసీ.. తాను కూడా సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి వీసీ, రిజిస్ట్రార్ స్థాయిలో ఉన్న అధికారులు సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి చివరకు పదవుల్లో ఉండకూడదనే నిబంధన ఉంది. కానీ సోషియాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఉన్న రమేష్ ఆ రూల్ పాటించకుండానే తానే నోటిఫికేషన్ ఇచ్చి, తానే ప్రమోషన్ ఇచ్చుకున్నారనే ఆరోపణలున్నాయి. 

ఇదిలాఉంటే ప్రభుత్వం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియమకాలను ఎప్పుడో వదిలేసింది. దీంతో యూనివర్సిటీల అవసరాల మేరకు వీసీలు ప్రభుత్వ అనుమతి తీసుకుని అనుబంధ అధ్యాపకులను నియమించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ లూప్ హోల్ ను ఆసరాగా తీసుకున్న వీసీ రమేష్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 16 మందిని అనుబంధ అధ్యాపకులుగా నియమించారనే ఆరోపణలున్నాయి.

ఫార్మసీ కాలేజీలకు ఇష్టారీతి పర్మిషన్లు…

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఫార్మసీ కాలేజీలకు వీసీ రమేష్ కాసులకు కక్కుర్తి పడి అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఫామ్ డీ కోర్సులు కలిగిన కాలేజీలకు అనుబంధ హాస్పిటల్స్ ఉండాలి. కానీ అలాంటి ఆసుపత్రులు లేకున్నా తరగతులు నిర్వహించేందుకు పర్మిషన్ ఇచ్చారనే ఆరోపణలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. 

యూనివర్సిటీకి సంబంధించిన పనుల విషయంలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అధికారులకు కక్కుర్తి పడినట్లు తెలిసింది. కొద్దిరోజుల కిందట వర్సిటీకి పాలు, పెరుగు సప్లై చేసే కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య ఏసీబీకి చిక్కగా, దాని వెనుక కూడా వీసీ చక్రం తిప్పారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

అనర్హులకు పీహెచ్డీ సీట్లు…..

పీహెచ్డీ సీట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలు యూనివర్సిటీని రాష్ట్ర స్థాయిలో చర్చల్లో నిలిపాయి. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో ప్రధానంగా పార్ట్ టైం అభ్యర్థులకు 25 శాతం, ఫుల్ టైం అభ్యర్థులకు 75 శాతం సీట్లు కేటాయించాల్సి ఉన్నా.. వీసీ కొన్ని సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపించాయి. దీంతోనే 2023 సెప్టెంబర్ లో యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు దాదాపు 50 రోజుల పాటు నిరసనలు చేపట్టారు. 

ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా, టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో కేయూకు వచ్చిన రేవంత్ రెడ్డి, తమ ప్రభుత్వం వస్తే అక్రమాలపై విచారణ జరిపి యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు త్రి సభ్య కమిటీ వేసి మొన్నటి ఫిబ్రవరిలో విచారణ జరిపించారు. కానీ ఆ తరువాత తీసుకున్న యాక్షన్ ఏమీ లేకపోవడంతో అధికారుల తీరుపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు.

భూ కబ్జా ఆరోపణలపైనా నో యాక్షన్..

కాకతీయ యూనివర్సిటీ భూములను వర్సిటీలోని ఏఆర్ పెండ్లి అశోక్ బాబు ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. కబ్జా నిజమేనని తేలినా తన అనుచరుడనే కారణంతో చర్యలు తీసుకోకుండా వీసీ రమేష్ లైట్ తీసుకున్నారనే విమర్శలున్నాయి. ఈ విషయంలోనూ వీసీ రమేశ్ తో పాటు ఏఆర్ అశోక్ బాబుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 

యూనివర్సిటీలో ఫేక్ సర్టిఫికేట్ల వ్యవహారం కలకలం రేపగా. పోలీసులకు సహకరించకుండా విషయాన్ని మరుగున పడేశారనే ఆరోపణలున్నాయి. దీంతో పాటు వివిధ విభాగాలలో పనిచేసే టీచర్లపై వ్యక్తిగత కక్షలకు పాల్పడటంతో పాటు రొటీన్ గా రావాల్సిన హెచ్ వో డీ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, డీన్ లాంటి పోస్టులను తనకు నచ్చిన వారికి కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

అకుట్ ఫిర్యాదుతో కదలిక

గత మూడేళ్లలో కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. తాటికొండ రమేష్ చేసిన అవినీతి అక్రమాలపై అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యునివర్సిటీ టీచర్స్(అకుట్) జనవరి 14, జనవరి 24 న రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం డైరెక్టర్ జనరల్, విజిలెన్స్ కు విచారణ కోసం శనివారం ఆదేశాలు జారీ చేశారు. 

ఈ సందర్భంగా అకుట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మామిడాల ఇస్తారి మాట్లాడుతూ గత మూడేళ్లలో వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ టీచర్లు, విద్యార్థుల వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ వస్తున్నారన్నారు. వర్సిటీలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, గతంలో కేయూ పాలక మండలికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. వీసీ రమేష్ పై విజిలెన్స్ విచారణకు ఆర్డర్స్ రావడంతో యూనివర్సిటీలో కలకలం మొదలైంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం