Siddipet : వ్యభిచార గృహంపై దాడి.. నలుగురు విటులు, ఒక మహిళ అరెస్ట్
07 October 2024, 12:51 IST
- Siddipet : వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నలుగురు విటులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక ప్రభుత్వ ఉపాద్యాయుడు ఉన్నారు. హోమియోపతి డాక్టర్ పరారీలో ఉన్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.
పోలీసుల అదుపులో విటులు
సిద్దిపేట పట్టణం శివాజీ నగర్‌కి చెందిన చంద్రమౌళి ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సిద్దిపేట టాస్క్ ఫోర్స్, వన్ టౌన్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. బూర శ్రీనివాస్ (ప్రభుత్వ ఉపాద్యాయుడు), మోతె వెంకటేష్, కొత్తపల్లి శంకర్, మిద్దె ప్రసాద్ తోపాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. మరొకరు ఉడకం చంద్రమౌళి (హోమియోపతి డాక్టర్) పరారీలో ఉన్నారు. వారి వద్ద నుండి రూ. 2 వేల నగదు, 6 సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ.. సంఘ వ్యతిరేక కార్యక్రమాలు, జూదం, పేకాట, వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఎలాంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా.. కలిగి ఉన్నా వెంటనే డయల్ 100, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667445, 8712667446, 8712667447 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు.
చేతబడి అనుమానంతో..
చేతబడి అనుమానంతో ఒక మహిళపై గురువారం రాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమె మృతికి కారణమైన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు.. రామాయంపేట సీఐ వెంకట రాజాగౌడ్ తెలిపారు. రామాయంపేట సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. కాట్రియాల గ్రామానికి చెందిన పోశవ్వ హైదరాబాద్‌లో నివాసం ఉండేది. ఇటీవలే గ్రామానికి వచ్చింది. అయితే.. ఆమె అనారోగ్యానికి.. అదే గ్రామానికి చెందిన ద్యాగల ముత్తవ్వ (48) కారణమని ఆరోపించింది.
దీంతో ఆరుగురు వ్యక్తులు ముత్తవ్వ ఇంటికి వెళ్లి కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ముత్తవ్వ మృతి చెందింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ద్యాగల మురళీ తోపాటు రామస్వామి, శేఖర్, రాజలత, లక్ష్మి, పోశవ్వను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరికి మరికొందరు సహకరించారని తెలిసిందని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. గతంలో వీరికి భూతగాదాలు ఉన్నట్లు పోలీసులు వివరించారు.
(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)