Blast Plan in Hyderabad : దసరా రోజు హైదరాబాద్‌లో బ్లాస్ట్‌కు ప్లాన్.. అప్పుడు తప్పింది.. ఇప్పుడు ఏం చేసేవారో!-most wanted criminal rizwan is located in the old city of hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Blast Plan In Hyderabad : దసరా రోజు హైదరాబాద్‌లో బ్లాస్ట్‌కు ప్లాన్.. అప్పుడు తప్పింది.. ఇప్పుడు ఏం చేసేవారో!

Blast Plan in Hyderabad : దసరా రోజు హైదరాబాద్‌లో బ్లాస్ట్‌కు ప్లాన్.. అప్పుడు తప్పింది.. ఇప్పుడు ఏం చేసేవారో!

Basani Shiva Kumar HT Telugu
Sep 23, 2024 10:07 AM IST

Blast Plan in Hyderabad : హైదరాబాద్‌ పాతబస్తీలో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ రిజ్వాన్‌ మకాం వేశాడు. సైదాబాద్‌ గ్రీన్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ రిజ్వాన్‌‌కు ఐసిస్‌తో సంబంధం ఉన్నట్టు ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో బ్లాస్ట్‌కు ప్లాన్
హైదరాబాద్‌లో బ్లాస్ట్‌కు ప్లాన్

ఐసిస్‌తో సంబంధాలున్న అబ్దుల్‌ హాజి అలీ.. అలియాస్‌ రిజ్వాన్‌ 4 నెలలు హైదరాబాద్‌లోనే మకాం వేసినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. అతడు నివాసం ఉన్న ఫ్లాట్‌లో ఆదివారం ఎన్‌ఐఏ బృందం సోదాలు చేసింది. ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు.

భారీ బ్లాస్ట్‌కు ప్లాన్..

2022లో దసరా రోజు హైదరాబాద్‌లో భారీ బ్లాస్ట్ చేసేందుకు ప్లాన్ జరిగింది. పాకిస్థాన్‌ నుంచే ఘోరీ ప్లాన్ వేయగా.. పోలీసులు సకాలంలో గుర్తించడంతో ప్రమాదం తప్పింది. అప్పట్లో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి.. గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. రిజ్వాన్ 4 నెలలుగా హైదరాబాద్‌ లో ఉండటంతో.. మళ్లీ ఏ ప్లాన్ వేశారోననే చర్చ జరుగుతోంది.

మోస్ట్ వాంటెడ్..

రిజ్వాన్ ఎన్‌ఐఏ జాబితాలో మోస్ట్‌ వాంటెడ్‌ గా ఉన్నాడు. అతడిపై ఢిల్లీ, పుణెల్లో పలు కేసులున్నాయి. రిద్వాన్ స్వస్థలం దర్యాగంజ్‌. మొన్న ఆగస్టులో ఢిల్లీ స్పెషల్‌సెల్‌ పోలీసులు రిజ్వాన్‌ ను అరెస్ట్‌ చేశారు. అతడు పుణె కేసులో తప్పించుకు తిరుగుతున్న ఉగ్రవాది అని.. 4 నెలలుగా హైదరాబాద్‌లో మకాం వేశాడని విచారణలో తేలింది.

వ్యాపారం కోసం వచ్చానని..

హైదరాబాద్ చేరిన రిజ్వాన్‌.. ఈ ఏడాది మార్చిలో సైదాబాద్‌ శంకేశ్వర్‌ బజార్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. వ్యాపారం చేసేందుకు వచ్చినట్లు అందరినీ నమ్మించాడు. రిజ్వాన్ రోజూ ఉదయం బయటకు వెళ్లి.. సాయంత్రానికి ఇంటికి చేరేవాడని.. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని స్థానికులు చెబుతున్నారు. ఎన్ఐఏ బృందం సడెన్‌ గా వచ్చి సోదాలు నిర్వహించడంతో.. ఏం జరుగుతుందోనని స్థానికులు భయపడ్డారు.

ఢిల్లీలో అరెస్టు..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దే శవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీ స్పెషల్‌ పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో రిజ్వాన్‌ పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో భాగంగా.. హైదరాబాద్‌లో మకాం వేసినట్లు తేలింది. దీంతో మరింత సమాచారం సేకరించేందుకు ఎన్‌ఐఏ బృందం రిజ్వాన్‌ నివాసం ఉన్న ఫ్లాట్‌ను పరిశీలించింది.

రూ.3 లక్షల రివార్డ్..

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న రిజ్వాన్‌.. నగరంలో ఉండేందుకు పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఫర్హతుల్లా ఘోరీ సహకరించినట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఓ ఉద్యోగి ఫ్లాట్‌లోనే రిజ్వాన్‌ అద్దెకు దిగినట్లు తెలుస్తోంది. తలాబ్‌ కట్టకు చెందిన ఓ యువకుడు రిజ్వాన్‌ సోదరుడినంటూ తరచూ ఫ్లాట్‌కు వచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు. రిజ్వాన్‌ తలపై ఎన్‌ఐఏ రూ.3 లక్షల రికార్డు ప్రకటించింది.