TG DSC 2024 Update : ఒక్కొక్కరికి ఒకే పోస్టు.. సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసిన అధికారులు.. 7 ప్రధానాంశాలు ఇవే
TG DSC 2024 Update : తెలంగాణ డీఎస్సీ 2024కు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది. అయితే.. చాలామంది ఎస్ఏ, ఎస్‌జీటీ పోస్టులకు పరీక్షలు రాశారు. కొంతమంది రెండు పోస్టులకు అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్కరికి ఒకే పోస్టు వచ్చేలా సాఫ్ట్‌వేర్ సిద్ధం చేశారు.
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2024 డీఎస్సీలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల్లో.. ఏదో ఒక దానికే ఎంపికయ్యేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను కూడా రెడీ చేసింది. దీని కారణంగా.. నియామకాల తర్వాత మళ్లీ పోస్టుల ఖాళీలు ఉండబోవని అధికారులు చెబుతున్నారు. డీఎస్సీ ఫలితాలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1. 2024 డీఎస్సీ ఫలితాలు వెల్లడి అయ్యాయి. వందల మంది అభ్యర్థులు రెండు, మూడు పోస్టులకు ఎంపికవుతున్నారు. వారు ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్లీ పోస్టులు ఖాళీగా ఉంటాయి.
2. పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితిని నివారించేందుకు మొదట ఎస్‌ఏ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేయడానికి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
3. స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎస్‌జీటీకి ఎంపికైన వారికి సంబంధించిన జాబితా విడుదల చేయనున్నారు. మొదటి జాబితాలో ఉన్న వారెవరైనా రెండో దానిలోనూ ఉంటే.. ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్‌లో ఉన్న వారిని చేర్చనున్నారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు.
4.టీచర్ పోస్టులకు పోటీపడిన వారిలో అధిక శాతం మంది మహిళలే ఉన్నారు. వివాహం ముందు, తరువాత వారి ఆధార్‌కార్డుల్లో ఇంటి పేర్లు, ఇతర వివరాలు వేరుగా ఉన్నాయి. దీంతో ధ్రువపత్రాల పరిశీలన సందర్భంగా డీఈవోలు అభ్యర్థుల భర్తలను పిలిచి వారితో ఈమె తన భార్య అని లెటర్ రాయించుకుంటున్నారు.
5. టీచర్ పోస్టుల భర్తీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం మొత్తం 25,924 మందికి అవకాశం కల్పించారు. కానీ.. 24,466 మంది హాజరయ్యారు. 1,458 మంది రాలేదు.
6. ఖాళీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి కోరారు. స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు కూడా అన్ని జిల్లాల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు.
7.ప్రత్యేకావసరాల పిల్లలకు బోధించేందుకు ఈసారి 220 ఎస్‌ఏ, 796 ఎస్‌జీటీ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటికి టెట్ అవసరం లేదని గత ఏప్రిల్‌లో 62 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 17 జిల్లాల్లోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేశామని అధికారులు చెబుతున్నారు. 16 జిల్లాల్లో జరగలేదని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.