TG DSC Results 2024 : డీఎస్సీ ఫలితాలు ఎప్పుడు...? ఫైనల్ కీ అభ్యంతరాలపై విద్యాశాఖ ఏం చేయబోతుంది..?
TG DSC Results 2024 : తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఓవైపు ఫైనల్ కీల పై అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో పాటు జనరల్ ర్యాంకింగ్ జాబితా కూడా విడుదల చేసే విషయంలో సందిగ్ధత నెలకొంది. తుది ఫలితాల ప్రకటన మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ డీఎస్సీ తుది ఫలితాలు మరికొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఫైనల్ కీ లు రాగా… టెట్ సవరణ వివరాలను స్వీకరణ కూడా పూర్తి అయింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే…. ఫైనల్ కీ లపై పలువురు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై విద్యాశాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఫైనల్ కీపై వచ్చిన అభ్యంతరాల విషయంలో విద్యాశాఖ నుంచి క్లారిటీ వస్తే… తుది ఫలితాల ప్రక్రియ వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది. కానీ అభ్యర్తులు లేవెనత్తిన ఫైనల్ కీ అభ్యంతరాలపై ఎలాంటి ప్రకటన రావటం లేదు. దీంతో అభ్యర్థులు కూడా విద్యాశాఖ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఫైనల్ కీలపై వచ్చిన అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు. డీఎస్సీ పరీక్షలో ఒక్క మార్కు కూడా కీలకంగా ఉంటుందని.. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.
ఇదే విషయంపై హిందుస్తాన్ టైమ్స్ తెలుగు… డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థి డబ్బికార్ శ్రీకాంత్(రంగారెడ్డి జిల్లా) తో మాట్లాడింది. ఫైనల్ కీపై క్లారిటీ ఇచ్చి… వెంటనే జనరల్ ర్యాంకింగ్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని కోరారు.జిల్లాల వారీగా మెరిట్ లిస్టులను ఇచ్చి… సాధ్యమైనంత త్వరగా మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
కీలకంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్…!
జిల్లాల వారీగా జనరల్ ర్యాంకులను ప్రకటించిన తర్వాత…. ధ్రువపత్రాల పరిశీలన ఉండనుంది. ఇందుకోసం ఒక్క పోస్టుకు ముగుగు చొప్పున ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి తర్వాత…పోస్టుకు ఒకరికి ఎంపిక చేస్తారు. వారికి నియామక ఉత్తర్వులను అందజేస్తారు. అయితే మొత్తం ప్రక్రియల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కీలకంగా ఉంటుంది. ఇందులోని ర్యాంకులను బట్టి అభ్యర్థులు ఓ అంచనాకు రావొచ్చు.
ఇక ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా చూస్తే.. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.
మరోవైపు సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలన్న ఉద్దేశ్యంతో సర్కార్ ఉంది. ఈ విషయంలో ఓ డెడ్ లైన్ కూడా పెట్టుకుని పని చేస్తోంది. ఈ క్రమంలో డీఎస్సీ పరీక్షలను కూడా వాయిదా వేయకుండా షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేసింది. ఇటీవలనే టెట్ వివరాలను సవరించుకునే అవకాశం కూడా ఇచ్చింది.