KVP Letter to Revanth Reddy : నా ఫామ్‌హౌజ్‌ను నేనే కూలుస్తా.. రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కేవీపీ
04 October 2024, 14:53 IST
- KVP Letter to Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ నేతగా ఎలాంటి మినహాయింపులు వద్దని స్పష్టం చేశారు. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలన్నారు. ఎవరూ కలుగచేసుకోకుండా చట్టాన్ని తన పని తాను చేసుకుని పోనిద్దామన్నారు.
కేవీపీ రామచంద్రరావు
మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ అజీజ్‌నగర్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఏదైనా భూభాగం ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్), బఫర్‌లో ఉంటే కూల్చివేయాలని స్పష్టం చేశారు. తమ కుటుంబం చట్టాన్ని గౌరవిస్తుందని.. ఆక్రమణలుంటే తమ సొంత ఖర్చులతో తొలగించే బాధ్యత తీసుకుంటామని కేవీపీ లేఖలో పేర్కొన్నారు.
ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని కేవీపీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. "ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో అంగుళం నిర్మాణం జరిగినా.. ప్రభుత్వంపై భారం పడకుండా 48 గంటల్లో దానిని కూల్చివేసి.. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తామని నేను స్పష్టం చేశాను" అని కేవీపీ వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష నాయకులు, మీడియాకు అనుమతినిచ్చి.. సరిహద్దులను గుర్తించాలని కోరారు. “మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది బహిరంగంగా జరగనివ్వండి, ప్రతి ఒక్కరూ గమనించే అవకాశం ఇవ్వండి” అని కేవీపీ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ నాయకుడిగా తనకు ఎలాంటి మినహాయింపు వద్దని కేవీపీ స్పష్టం చేశారు. “నాకు చట్టం నుండి ఎలాంటి మినహాయింపులు అక్కర్లేదు. నా పట్ల సాధారణ పౌరుడిలాగా ప్రవర్తించండి. చట్టాన్ని తన పనిని తాను చేసుకోనివ్వండి” అని లేఖ రాశారు.
ఫామ్‌హౌస్ సమస్యను పరిష్కరించడంతో పాటు.. మూసీ నదిని శుభ్రపరిచి, సుందరీకరించడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ చొరవకు కేవీపీ మద్దతును తెలిపారు. తాను రాజ్యసభలో ఉన్న సమయంలో నేరేడుచెర్ల పర్యటనను గుర్తుచేసుకున్నారు. మూసీ జలాల కలుషిత స్థితిని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ప్రయత్నాలను స్వాగతించారు. "మీ నాయకత్వంలోని మూసీ క్లీనప్, బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్‌కు నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను" అని లేఖలో పేర్కొన్నారు.
మొదటి దశలో క్లీనప్‌ను పూర్తి చేసి, రెండో దశలో సుందరీకరణకు పనులు చేపట్టాలని కేవీపీ సూచించారు. నిబద్ధతతో కూడిన కాంగ్రెస్ కార్యకర్తగా.. పేదలకు నష్టం జరగకుండా.. ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తాను అండగా ఉంటానని కేవీపీ స్పష్టం చేశారు.