Polavaram Dream : పోలవరం చంద్రబాబు కలేనా….? కేవీపీ షాకింగ్ కామెంట్స్….!
Polavaram Dream ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు విషయంలో అసలు క్రెడిట్ ఎవరిదనేది రాజకీయ పార్టీల మధ్య తరచూ విమర్శలకు కారణమవుతుంది. వైఎస్.రాజశేఖర్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టును ఆచరణలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్రిశంకు స్వర్గంలో పడింది. పోలవరం ప్రాజెక్టు అంచనాల నుంచి ఆచరణలో వాస్తవ రూపంలోకి ఎలా వచ్చిందనే విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు కేవీపీ ఇటీవల పుస్తక రూపంలో వివరించారు. పుస్తకంలో టీడీపీ అధినేత చంద్రబాబు గురించి ఆసక్తికరమైన వివరాలను కేవీపీ వెల్లడించారు.
Polavaram Dream పోలవరం ప్రాజెక్టు క్రెడిట్‌ను దక్కించుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల మధ్య తరచూ మాటల యుద్ధాలు సాధారణమే అయినా ప్రాజెక్టు నిర్మాణానికి కర్త-కర్మ-క్రియగా వ్యవహరించిన వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆలోచనల గురించి ఆయన ఆప్త మిత్రుడు మాజీఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇటీవల ఓ పుస్తకం రచించారు. “పోలవరం-ఓ సాహసి ప్రయాణం” పేరిట పుస్తకాన్ని విడుదల చేశారు.
కేవీపీ రామచంద్ర రావు పుస్తకంలో పోలవరం ప్రాజెక్టు ఆలోచనల నుంచి ఆచరణలోకి వచ్చే క్రమంలో ఎదురైన అడ్డంకుల గురించి కులంకూషంగా చర్చించారు. వైఎస్‌తో కేవీపీ స్నేహం మొదలైనప్పట్నుంచి డెల్టా ప్రాంతాలకు రాయలసీమ దుర్భిక్ష పరిస్థితులకు నీటిలభ్యత లేకపోవడమే కారణమని ఆలోచనతో సాగు నీటి ప్రాజెక్టులకు వైఎస్ ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారనేది పుస్తకంలో వివరించారు. ఇదే పుస్తకంలో చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో వ్యవహరించిన తీరును కేవీపీ వివరించారు.
కేవీపీ రామచంద్రరావు పుస్తకంలో “పోలవరం చంద్రబాబు కల అట” అంటూ ఓ అధ్యాయాన్ని రచించారు. చంద్రబాబుకు నిజంగా పోలవరం ప్రాజెక్టుపై చిత్తశుద్ధి ఉంటే 1996-2000 మధ్య కాలంలోనే పోలవరం ప్రాజెక్టు సాకారం అయ్యేదని ప్రస్తావించారు. 1996-2004 మధ్య కాలంలో ఏం జరిగిందో కేవీపీ వివరించారు.
2014లో రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వపరిధిలోకి రాగానే ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు పేరుతో ఇందిరా పేరును చంద్రబాబు నాయుడు తొలగించినట్లు కేవీపీ పేర్కొన్నారు. ఆంధ‌్రప్రదేశ్ విభజన చట్టానికి విరుద్ధంగా పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు చేతిలో పెట్టగానే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన కలగా ప్రచారం చేసుకోవడం ప్రారంభించారని కేవీపీ విమర్శించారు.
చంద్రబాబు విజన్ 2020 పుస్తకంలో ఎక్కడా పోలవరం ప్రస్తావన కనిపించదని, 1996-2004 మధ్య కాలంలో ఒక్కసారి కూడా పోలవరం ప్రాంతానికి చంద్రబాబు వెళ్లలేదన్నారు. 1995లో చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినపుడు తూర్పు గోదావరి జిల్లా కడియం ఎమ్మెల్యేగా ఉన్న వడ్డి వీరభద్రరావు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏడాదిలోపు ప్రారంభించకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారని పేర్కొన్నారు.
1996 పార్లమెంట్ ఎన్నికల్లో ఏప్రిల్ 27న కొయ్యలగూడెం బహిరంగ సభలో పోలవరం కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారని, ఎన్నికలు పూర్తి కాగానే బాబు మాట మార్చేశారని పేర్కొన్నారు. 1996లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే 7వేల కోట్ల రుపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించే స్థితిలో లేదని ప్రకటించారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే 35టిఎంసిల నీటిని మహారాష్ట్ర, కర్ణాటకలకు ఇవ్వాల్సి వస్తుందని,రాష్ట్రానికి నష్టం కలుగుతుందని ప్రచారం చేశారని కేవీపీ విమర్శించారు. ఫలితంగా 1996 సెప్టెంబర్ 1న వడ్డి వీరభద్రరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజానగరం నుంచి ఢిల్లీకి మోటర్ సైకిల్ యాత్ర చేసినట్లు గుర్తు చేశారు.
దేవగౌడ ఉన్నత స్థాయి సమావేశం…..
1996 సెప్టెంబర్ 11న పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని దేవగౌడ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టుపై సమీక్షించారు. దేవగౌడ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రాజెక్టు రివైజ్డ్ అంచనాలు, సహాయ, పునరావాస ఏర్పాట్ల వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదని ప్రణాళిక సంఘం ప్రధానికి వివరించింది. ఆ సమావేశంలో అప్పటి కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు సైతం పాల్గొన్నారు. ఆ తర్వాత 1997లో గుజ్రాల్ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా పోలవరం సాధన సమితి తరపున ప్రతినిధులు వస్తే వారిని వైఎస్. స్వయంగా ప్రధాని వద్దకు తీసుకువెళ్లారని కేవీపీ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని కార్యాలయాల నుంచి ఎన్నిసార్లు రిమైండర్లు వచ్చినా అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఆసక్తి చూపలేదని వివరించారుు. 1996-2004 మధ్య పోలవరం ప్రాజెక్టు సాధన కోసం ఎన్ని పోరాటాలు, ఉద్యమాలు జరిగినా వాటిని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని కేవీపీ ఆరోపించారు. 2004లో వైఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు విషయంలో కదలిక వచ్చిందని, కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకువచ్చి,పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించిన తర్వాత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు తన కలగా ప్రచారం చేసుకుంటున్నారని కేవీపీ విమర్శించారు.
పట్టిసీమతో లాభమా, నష్టమా…..?
పోలవరం ప్రాజక్టులో భాగంగా ప్రధాన డ్యామ్ లేకుండానే పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీటిని కుడి కాల్వలోకి తరలించడం వల్ల నికర జలాలు నష్టపోతున్నామని కేవీపీ ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్‌లో పోలవరం ప్రాజెక్టుకు 80టిఎంసిల నీటని కృష్ణా డెల్టాకు తరలిస్తే కృష్ణా కేటాయింపుల్లో ఉమ్మడి ఏపీకి 45 టిఎంసిలు, కర్ణాటకకు 21 టిఎంసిలు, మహారాష్ట్రకు 14 టిఎంసిలు వాడుకోడానికి అనుమతి లభిస్తుందన్నారు.
పట్టిసీమ నుంచి నీటి తరలింపు ప్రారంభం కాగానే కర్ణాటక ప్రభుత్వం తమకు రావాల్సిన 21టిఎంసిలకు తగ్గట్టుగా ప్రాజెక్టులకు కేటాయించుకుంది. పట్టిసీమ నుంచి కృష్ణాకు తరలిస్తున్న నీటికి సమానంగా ఎగువన కృష్ణా జలాలు కర్ణాటక తీసుకుంటోందని కేవీపీ వివరించారు. కర్ణాటక షిగ్గాన్ లిఫ్ట్ స్కీం నిర్మాణానికి నీటిని తరలిస్తోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండానే కర్ణాటకకు నీరు వాడుకోవడానికి చంద్రబాబు కారణమయ్యారని కేవీపీ విమర్శించారు. మహారాష్ట్ర సైతం పట్టిసీమ నుంచి నీటి తరలింపుతో ఎగువున అదనపు నీరు వాడుకుంటోందని పేర్కొన్నారు.