AP Welfare Schemes: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ , మహాత్మ జ్యోతి బాఫూలే, గుర్రం జాషువా, పుచ్చలపల్లి సుందరయ్య , ఎస్ ఆర్ శంకరన్ వంటి మహానీయుల పేర్లు పెట్టాలని, దివంగత ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్ జయంతి , వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పలు పథకాలకు పెట్టిన పేర్లను మార్చి తెలుగుదేశం ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టడాన్ని స్వాగతిస్తున్నా, కొత్త పథకాల పేర్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఎక్కడా లేదని గుర్తు చేశారు.
గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలకు , పత్రాలకు జగన్, వైఎస్‌రి బొమ్మలను ముద్రించుకున్నారని . వీటిపై ప్రజల్లో వ్యతిరేక వచ్చిందని గుర్తు చేశారు. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతకు గత ఎన్నికల తీర్పు చూసారని, .జగనన్న అమ్మ ఒడిని తల్లికి వందనం , జగన్నన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర , జగనన్న గోరు ముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, జగనన్న ఆణిముత్యాలు పథకానికి అబ్ధుల్ కలాం ప్రతిభ పురస్కారం పేర్లు గా మార్పు చేయడం అభినంధనీయమైనా కొత్త పేర్లలో ఎక్కడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు లేకపోవడం భాధాకరమని పేర్కొన్నారు.
అంబేద్కర్ విదేశీ విద్యకు జగన్నన్న విదేశీ విద్య పేరు పెట్టారని దళిత సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు అప్పట్లో తీవ్రంగా తప్పు పట్టాయని, జగనన్న విదేశీ విద్య పేరును మార్చి అంబేద్కర్ పేరు పెట్టాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం విజ్ఞప్తి చేసింది.
రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాకపోయినా దళిత సామాజిక వర్గంలో పుట్టక పోయినా దళితుల సంక్షేమం , అభివృద్ధి కోసం అనేక పథకాలు పెట్టి తద్వారా వారి సేవలు స్పూర్తి నింపిన మాజీ ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్ పేరుతో పాటు మహాత్మ జ్యోతి బాఫూలే, గుర్రం జాషువా , పుచ్చలపల్లి సుందరయ్య పేర్లను ప్రభుత్వం పెట్టబోయే ప్రభుత్వ పథకాలకు పెట్టాలని కేవీపీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు నల్లప్ప, మాల్యాద్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి లేఖరాశారు.
దళిత, గిరిజనుల సమస్యలను అర్ధం చేసుకుని వారి అభివృద్ధి , సంక్షేమ కోసం అనేక పధకాలు , సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసి ఎందరో ఐఏఎస్ లకు మార్గదర్శిగా నిలిచి, దళిత గిరిజన బలహీన వర్గాల సంక్షేమ కోసం చివరి వరకు నిలిచిన దివంగత ఎస్‌ఆర్ శంకరన్ జయంతి , వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.