తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Rains : అకాల వర్షాలు.... ఓరుగల్లు కాలనీల్లోకి వరద నీరు..!

Warangal Rains : అకాల వర్షాలు.... ఓరుగల్లు కాలనీల్లోకి వరద నీరు..!

HT Telugu Desk HT Telugu

18 May 2024, 6:35 IST

google News
    • Rains in Warangal : అకాల వర్షాల దాటికి వరంగల్ నగరంలోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. ముఖ్యంగా సిటీ శివారులోని లోతట్టు ప్రాంతాలకు నీళ్లు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు.
ఓరుగల్లు కాలనీల్లోకి వరద నీళ్లు
ఓరుగల్లు కాలనీల్లోకి వరద నీళ్లు

ఓరుగల్లు కాలనీల్లోకి వరద నీళ్లు

Flood Water in Warangal City : అకాల వర్షాలు ఓరుగల్లు ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. వరద నీటితో వరంగల్ ట్రై సిటీ జనాలు అవస్థలు పడాల్సి వచ్చింది. 

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఓ వైపు మెయిన్ రోడ్లపై నీళ్లు నిలిచి ఇబ్బందులు తలెత్తగా, వాటిని క్లియర్ చేయడానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాంతో పాటు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ మహానగరంలోని పలు కాలనీల్లోకి నీళ్లు చేరాయి. ముఖ్యంగా సిటీ శివారులోని లోతట్టు ప్రాంతాలకు నీళ్లు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా తమ సమస్యను పట్టించుకోవడం లేదని లోతట్టు ప్రాంతాల జనాలు ఆవేదన వ్యక్తం చేశారు.

నీట మునిగిన కాలనీలు…

రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు వరంగల్ నగరంలోని పలు కాలనీల్లోకి నీళ్లు చేరాయి. ముఖ్యంగా వరంగల్ ఏనుమాముల మార్కెట్ మార్గంలోని కోట చెరువు ఆ పై ప్రాంతం నుంచి వచ్చే వరద నీటితో ఎస్ఆర్ నగర్, సాయి గణేశ్ కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, వివేకానంద కాలనీ, తదితర ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. 
సిటీ పైభాగం నుంచి వచ్చే వరద నీరంతా అక్కడికే చేరుతుండటం, అక్కడి నుంచి వరద నీరు సక్రమంగా వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడం సమస్యగా మారింది. దీంతో పైనుంచి వచ్చిన వరద నీళ్లన్నీ కాలనీల్లోనే నిల్వ ఉంటున్నాయి. ఫలితంగా గురువారం రాత్రి కురిసిన వర్షానికి మోకాళ్ల లోతు వరకు నీళ్లు చేరగా.. ఆయా ఏరియాలన్నీ చెరువులను తలపించాయి. దీంతో అక్కడి జనాలు కనీసం బయటకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పైనుంచి వచ్చే వరదకు అనుగుణంగా మురుగు కాల్వలు లేకపోవడం, కాలనీ నుంచి వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడం వల్లే నీళ్లు నిలిచి ఉంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

జలమయమైన జనగామ…

గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జనగామ ఙల్లా కేంద్రం జలమయమైంది. స్థానిక బస్టాండ్ ఏరియా, చౌరస్తాతో పాటు పట్టణంలోని రోడ్లు చెరువులను తలపించాయి. ముఖ్యంగా పట్ణణంలో వరంగల్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై నీళ్లు చేరడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చాలాచోట్లా ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడగా ప్రయాణికులు అసౌకర్యానికి గురి కావాల్సి వచ్చింది. జనగామ టౌన్ లోని పలు కాలనీల్లో వరద నీరు చేరగా స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమైంది.

ధాన్యం తడిసి రైతులకు ఇబ్బందులు

శుక్రవారం సాయంత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని వెంకటాపూర్, గోవిందరావు పేట మండలాల్లో వర్షం దంచి కొట్టగా, రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చిన ధాన్యం తడిసిపోయింది. కొనుగోళ్లు జరగక పోవడం వల్లే తాము నష్టపోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేయగా.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధించకుండా కొనుగోలు చేయాలనే డిమాండ్లు వ్యక్తమయ్యాయి. 

ఇక హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడగా.. రైతులు ఇబ్బందులు పడక తప్పలేదు. ఇంకో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో అన్నదాతల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం