తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Govt Nominated Posts : సంక్రాంతి లోపే నామినేటెడ్ పదవుల భర్తీ..! ఛాన్స్ కొట్టేసే నేతలెవరో..?

TS Govt Nominated Posts : సంక్రాంతి లోపే నామినేటెడ్ పదవుల భర్తీ..! ఛాన్స్ కొట్టేసే నేతలెవరో..?

30 December 2023, 10:23 IST

google News
    • Telangana Govt Nominated Posts : త్వరలోనే నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ దిశగా కసరత్తు జరుగుతుండగా… సంక్రాతి లోపే ఈ ప్రక్రియ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణలో నామినేటెడ్ పదవులు..!
తెలంగాణలో నామినేటెడ్ పదవులు..!

తెలంగాణలో నామినేటెడ్ పదవులు..!

TS Govt Nominated Posts : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్…. జోష్ తో ముందుకెళ్తోంది. పార్టీ అధికారంలోకి రావటంతో… చాలా మంది నేతలు, కార్యకర్తలు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకుంటున్నారు. ఇప్పటేక్ వాళ్లు…. ముఖ్య నేతల వద్ద ప్రతిపాదనలు కూడా పెట్టుకున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే దృష్టిపెట్టిన రాష్ట్ర నాయకత్వం….ఢిల్లీ పెద్దలతో కూడా ప్రాథమికంగా చర్చలు జరిపింది. అయితే సంక్రాంతి లోపే ఈ పదవులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్‌ పదవుల భర్తీ కోలాహలం మొదలైంది.

పదేండ్లుగా అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ… పార్టీ కోసం పనిచేసిన నేతలకు సంక్రాంతి కానుకగా నామినెటెడ్‌ పోస్టులు ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో 50కి పైగా కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటికి తోడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలతో పాటు పలు స్థానాలకు ఉప ఎన్నికలకు జరిగే అవకాశం ఉంది. ఇవే కాకుండా…ఆరు మినిస్టర్ బెర్త్ లు కూడా భర్తీ చేయాల్సి ఉంది. వీటన్నింటి నేపథ్యంలో…. పార్టీలోని సీనియర్ నేతలు వీటిపై ఫోకస్ పెట్టారు. గెలిచిన వారితో పాటు ఓడిపోయిన నేతలు కూడా వారి స్థాయికి తగ్గట్టుగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

ప్రధానంగా ఎమ్మెల్సీ పదవుల కోసం సీనియర్ నేతలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ఈ లిస్టులో చూస్తే… మధుయాష్కీగౌడ్‌, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, ఫిరోజ్ ఖాన్, అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, మైనంపల్లి, ప్రతాప్ రెడ్డి, జంగా రాఘవ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డితో పాటు చాలా మంది నేతలు ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలుగా గెలిచిన మల్ రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు మంత్రి పదవులపై కన్నేశారు.

ఇక పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ చాలా ఏళ్లుగా పార్టీ కోసమే పని చేస్తున్న నేతలు, కార్యకర్తలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్యారాచూట్‌ నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా…. పార్టీ కోసమే నిరంతరం పని చేసిన వారిని గుర్తించే అవకాశం ఉంది. అంతేకాకుండా…. నామినేటెడ్ పదవుల్లో అమరవీరుల కుటుంబాలకు కూడా అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు ప్రొఫెసర్ కొదండరామ్ తో పాటు ప్రముఖ కవి అందె శ్రీ పేర్లను కూడా కాంగ్రెస్ సర్కార్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

కీలకమైన ఈ పదవులన్నీ ఈ సంక్రాంతి లోపే పూర్తి చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… నేతలకు గుర్తింపునిస్తే మరింత ఉత్సాహంతో పని చేసే అవకాశం ఉంటుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోందంట..! మొత్తంగా చూస్తే నామినేటెడ్ పదవులు దక్కించుకునే నేతలెవరో త్వరలోనే తేలిపోనుంది…!

తదుపరి వ్యాసం