TS Govt : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం, 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు
10 December 2023, 20:20 IST
- TS Govt : తెలంగాణలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సీఎం రేవంత్ రెడ్డి
TS Govt : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల సలహాదారుల నియామకాలు రద్దు చేయగా.. తాజాగా పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు విడుదల అయ్యాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన కార్పొరేషన్ ఛైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు.
సలహాదారుల నియామకాలు రద్దు
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేశారు. ఈ మేరకు సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ సీఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఐఏఎస్‌లు రాజీవ్ శర్మ, సోమేశ్ కుమార్, మాజీ ఐపీఎస్‌లు అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, మాజీ ఐఈఎస్ జీఆర్ రెడ్డి, మాజీ ఐఎఫ్ఎస్ ఆర్. శోభ, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం సలహాదారులుగా నియమించింది. తెలంగాణలో కొత్త ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.
కార్పొరేషన్ల ఛైర్మన్లు రాజీనామాలు
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వంలో పనిచేసిన సలహాదారులు రాజీనామాలు సమర్పించారు. అయితే కొందరు ఇంకా ఆ పదవుల్లోనే కొనసాగుతున్నారు. దీంతో ఆయా నియామకాలను రద్దు చేస్తూ శనివారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాలు మారినప్పుడు నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు గౌరవంగా రాజీనామాలు చేసి వెళ్లిపోతారు. అయితే కొందరు మాత్రం ఆయా పదవుల్లో కొనసాగితే కొత్త ప్రభుత్వాలు వారిని తొలగిస్తాయి. గత ప్రభుత్వంలో కేసీఆర్ సహాలదారులుగా నియమించిన వారిలో ఏడుగురి నియామకాలు రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కార్పొరేషన్ల ఛైర్మన్లు వారి పదవులకు రాజీనామాలు చేశారు.