తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet District : Siddipet District : కుమార్తె పెళ్లి చూపులకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం - తండ్రి, అన్న మృతి

Siddipet District : Siddipet District : కుమార్తె పెళ్లి చూపులకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం - తండ్రి, అన్న మృతి

HT Telugu Desk HT Telugu

01 February 2024, 20:46 IST

google News
    • Road Accident in Siddipet District : సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి, కొడుకు మృతి చెందారు. పది మందికిపైగా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి చూపులకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
పెళ్లి చూపులకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

పెళ్లి చూపులకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

Road Accident in Siddipet District : సొంత కుమార్తె పెళ్లి చూపులకు వెళుతూ, రోడ్డు ప్రమాదంలో తండ్రి చనిపోయిన విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లాలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. తండ్రి తో పాటు పెళ్లి కుమార్తె సొంత అన్న కూడా ఈ ప్రమాదంలో మృతి చెందగా,…12 మంది కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఊహించని ఈ ప్రమాదంతో, ఆ కుటుంబం మొత్తం కకావికలమైంది.

సికింద్రాబాద్ దగ్గ్గరలోని యాప్రాల్ ప్రాంతానికి చెందిన మిర్యాల శ్రీనివాస్ (55) తన భార్య విజయ కలిసి తమ బంధువుల సహాయంతో, తమ ఒక్కగానొక్క కూతురికి కరీంనగర్ జిల్లాలో ఒక సంబంధం చూసారు. శ్రీనివాస్, విజయ, వారి కుమారులు హనుమంత రావు, రమేష్, కోడలు జ్యోతి తన ఇద్దరు కొడుకు కృపాల్, తేజ, విజయ అన్న లక్ష్మణ్, వదిన సరిత వారి కుమారుడు సాయి, విజయ చెల్లెలు పావని, మరిది వీరబద్రం, వారి కుమారుడు బాబు తో కలిసి వీరబద్రం కి చెందిన మహీంద్రా జీతో ఆటో ట్రాలీలో అబ్బాయి ఇంటికి వెళ్తున్నారు. వీరబద్రం ఆటో నడుపుతుండగా. రమేష్ తనతో పాటు కేబిన్ లో కూర్చొన్నాడు.

ఆటో ట్రాలీ అతివేగంగా వెళుతున్న సమయంలో… రాజీవ్ రహదారి పైన రామునిపట్ల గ్రామం వద్దకు వచ్చేసరికి ఆటో వెనక టైర్ పగిలి పోయింది. అతివేగంతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా, డివైడర్ కు గుద్దుకొని, బోల్తాపడింది. ఆటో శ్రీనివాస్, హనుమంత రావు (29) మీద పడటంతో, వారిద్దరూ తీవ్ర రక్త గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. మిగతా, 11 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. వారందరిని సిద్దిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తదుపరి చికిత్స కోసం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ మాట్లాడుతూ, తన మరిది వీరబద్రం అతివేగంగా నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. తాము, కూతురు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనీ తలస్తే, దేవుడు మరో విదంగా తలచాడని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

ఈ ప్రమాదంతో, ఆటోలో ప్రయాణిస్తున్న 13 మంది రోడ్డు పైన రక్తపు మడుగులో చెల్లా చెదురుగా పడిపోయారు. అదృష్టవశాత్తు, ఆ దిశగా అప్పుడు ఏ వాహనాలు వెళ్ళకపోవడం వలన, మిగతావారికి ప్రాణాపాయం తప్పిందని స్థానికులు చెప్పారు. స్థానికులు వెంటనే 108 కి ఫోన్ చేసి అంబులెన్సులు రప్పించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్బంగా, చిన్నకోడూరు పోలీసులు మాట్లాడుతూ వాహనాల టైర్లు తరచుగా చెక్ చేసుకోవాలని అన్నారు. అతివేగంగా వెళితే కూడా, టైర్లు పగిలిపోయే అవకాశమున్నదని వారు తెలిపారు.

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి

తదుపరి వ్యాసం