Siddipet News : ఏఆర్ కానిస్టేబుల్ నరేశ్ ఆత్మహత్య నన్ను తీవ్రంగా కలచివేసింది- సిద్దిపేట కలెక్టర్
Siddipet News : ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల నరేశ్ తల్లిదండ్రులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Siddipet News : తన భార్యాపిల్లలను కాల్చి చంపి..ఆత్మహత్య చేసుకున్న గన్ మాన్, ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల నరేశ్ (35) మరణం తనను ఎంతగానో కలచి వేసిందని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. ఆ సంఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందన్నారు . తన వద్ద గన్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆకుల నరేశ్, భార్య, పిల్లలు హఠాత్తుగా మృత్యుఒడిలోకి పోవడం విషాదకరమైన ఘటనగా గుర్తుచేసుకున్నారు.
నరేశ్ కుటుంబాన్నిఆదుకుంటా
బుధవారం చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో గ్రామంలోని నరేశ్ ఇంట్లో వారి తల్లిదండ్రులు రాములు, లక్ష్మి , సోదరులు సురేష్, మహేష్ లను జిల్లా కలెక్టర్ పరామర్శించారు. ఏఆర్ కానిస్టేబుల్ నరేశ్, భార్య, ఇద్దరు పిల్లల చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఏఆర్ కానిస్టేబుల్ నరేశ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. తల్లిదండ్రులను కలెక్టర్ ఓదార్చారు. ఇలా జరగడానికి గల కారణాలను తొందరగా విచారణ జరపాలని చిన్నకోడూరు ఎస్సైకి సూచించారు.
ఆకుల నరేశ్ మృతి దురదృష్టకరం
పెద్ద కోడూరు గ్రామ శివారులో ఉన్న సీఏఆర్ హెడ్ క్వార్టర్ లో ఏఆర్ సిబ్బంది, అధికారులతో అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె శ్రీనివాసరావు బుధవారం మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో సీఏ ఆర్ హెడ్ క్వార్టర్ లో ఏఆర్ సిబ్బంది అధికారులతో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించారు. గత నాలుగైదు రోజుల క్రితం ఆకుల నరేశ్ ఏఆర్ కానిస్టేబుల్ చనిపోవడం దురదృష్టకరమైన సంఘటన అన్నారు. ఈ సంఘటన అందరినీ ఎంతో దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలన్నారు. తల్లిదండ్రులను కుటుంబాన్ని విధి నిర్వహణను సమానంగా చూసుకుని సమన్వయంతో జీవితం గడపాలన్నారు. మన కుటుంబంతో జీవించడం చాలా ముఖ్యమన్నారు. మానవ జీవితంలో నలుగురు మెచ్చుకునేలా జీవించాలని, ఉద్యోగం సాధించడానికి ఎంతో కష్టపడితే తప్ప ఆ స్థాయి రాదన్నారు. ఎన్నో పరీక్షలలో నెగ్గిన తర్వాత ఉద్యోగం సాధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు.
శిక్షణా కాలంలో మనసు శరీరం మైండ్ ఏకం చేసి మనకు శిక్షణ ఇచ్చారన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తామన్నారు. విధినిర్వహణలో కానీ జీవితంలో కానీ క్రమశిక్షణ తప్పితే జీవితం ఎలా మారుతుందో సమాజంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా పోలీస్ డిపార్ట్మెంట్ నిలుస్తుందన్నారు.
ఒత్తిడిని అధిగమించడానికి రన్నింగ్, వాకింగ్, యోగా, సైక్లింగ్
ఉద్యోగం రాకముందు మన జీవించిన జీవితం మనం కష్టపడ్డ ప్రతిక్షణం రోజుకు ఒకసారి ఆలోచించుకోవాలని అందె శ్రీనివాసరావు అన్నారు. పిల్లలను కష్టపడి చదివించి ఐఏఎస్ లు, ఐపీఎస్ లు సాధించిన వారు ఉన్నారన్నారు. ఆస్ట్రేలియా, అమెరికా ఇతర దేశాలలో ఎంతోమంది కానిస్టేబుల్ కొడుకులు కూతుర్లు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. అందరం ఒక కుటుంబం లాగా విధి నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పిల్లలను ఉన్నతంగా చదివించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. విధి నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఉన్నత అధికారులకు వెంటనే తెలియజేయాలన్నారు. ఆవేశంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని జీవితాలు పాడు చేసుకోవద్దని సూచించారు.