తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Erravalli Farmers: వరి వెదసాగు పద్ధతితో సిరులు పండిస్తున్న ఎర్రవల్లి రైతులు, వెదజల్లే పద్ధతిలో అధిక దిగుబడులు..

Erravalli Farmers: వరి వెదసాగు పద్ధతితో సిరులు పండిస్తున్న ఎర్రవల్లి రైతులు, వెదజల్లే పద్ధతిలో అధిక దిగుబడులు..

HT Telugu Desk HT Telugu

02 May 2024, 7:39 IST

google News
    • Erravalli Farmers: వరి వెదసాగు పద్దతి ద్వారా సాగుచేసి సిద్ధిపేట జిల్లా మేరకు మండలంలోని ఎర్రవల్లి గ్రామ రైతులు సిరులు పండిస్తున్నారు.
వరి వెద సాగుపై ప్రదర్శన
వరి వెద సాగుపై ప్రదర్శన

వరి వెద సాగుపై ప్రదర్శన

Erravalli Farmers: వెదసాగు paddy తో పంట కాలం, సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా మంచి దిగుబడులు సాధించి అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. వెదజల్లే పద్దతి ద్వారా రైతులకు 1 ఎకరాకు 34.2 క్వింటాళ్ల వరకు దిగుబడిని వచ్చిందని రైతులు, వ్యవసాయ అధికారులు తెలిపారు.

మర్కుక్ మండలంలోని లోని ఎర్రవల్లి గ్రామంలో వెదజల్లే పద్దతి ద్వారా వరి సాగు చేసి మంచి దిగుబడులు సాధించిన రైతుల పొలంలో వ్యవసాయ శాఖ అధికారులు ఇటీవల క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన వరంగల్ ఉప సంచాలకుడు ఉమారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో రోజురోజుకూ పెట్టుబడులు పెరిగి చిన్న, సన్నకారు రైతులు నష్టపోతున్నారన్నారు. వీటిని అధిగమించేందుకు కొందరు రైతులు భిన్నంగా ఆలోచించి వరిసాగులో వెదజల్లే పద్ధతి వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు.

వెదసాగు Veda Method పద్దతితో కూలీల కొరతను అధిగమించడంతో పాటు పెట్టుబడి ఖర్చును కూడా తగ్గించుకుంటున్నారని చెప్పారు. ఈ పద్ధతిపై వ్యవసాయ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారని ఆయన తెలియజేశారు. యాసంగి లో వెదసాగు పద్ధతి ద్వారా పంటవేసిన ఒక రైతు పొలంలో ఒక గుంట విస్తీర్ణంలో నిర్వహించిన పంట కోత ద్వారా, ఎకరాకు ఎంతపంట వస్తుందోనని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.

NP-9153 పుష్కల్ రకం, డిసెంబర్ 27, 2023న రైతు తన పొలంలో విత్తడం జరిగింది. సరిగ్గా, 124 రోజుల తర్వాత పంట చేతికి వచ్చింది, ఎకరాకు 34.2 క్వింటాళ్ల వరకు దిగుబడిని వచ్చిందని అయన తెలియజేశారు.

ఖర్చు తక్కువ లాభాలు అధికం .…

మర్కుక్ మండలంలో 605 ఎకరాలలో రైతులు వెద సాగు పద్ధతి ద్వారా ఈ యాసంగి వరి సాగు చేశారు. ఈ పద్దతితో రైతులు అనేక లాభాలు పొందుతున్నారు. నారుమడి పద్ధతిలో ఎకరాకు 25–30 కేజీల విత్తనం అవసరం ఉంటుంది. నారు పెరగడానికి 30 రోజుల సమయం పడుతుంది. నారు మడి పెంచడానికి రూ. రెండువేలకు పైగా ఖర్చవుతుంది.

వరినాటు కోసం కూలీలకు ఎకరానికి రూ.5వేల నుంచి రూ. 6వేలు ఖర్చు అవుతుంది. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయడానికి ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనం మాత్రమే అవసరమవుతుంది. కూలీల ఖర్చు అసలే ఉండదు. ఒక వ్యక్తి రోజుకి మూడెకరాల వరకు విత్తనం వేసుకోవచ్చు. దీంతో ఎకరాకు రూ. 6వేల నుంచి రూ. 8వేల వరకు ఖర్చు మిగులుతుందని తెలిపారు.

యాసంగిలో వరికి బదులుగా గింజలు, కూరగాయల సాగు..

రైతులు వెద పద్ధతిలో మరింత దిగుబడి సాధించాలంటే ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు. Yasangi యాసంగిలో వరికి బదులుగా అపరాలు, నూనె గింజ పంటలను, కూరగాయలను సాగు చేసుకోవాలని ఉమారెడ్డి సూచించారు.

కలుపు యాజమాన్యంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని విత్తిన 3 రోజుల లోపు, 20 రోజుల లోపు కలుపు మందులను పిచికారి చేసుకోవాలని అయన సూచించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దాదాపు 200 ఎకరాలకు ఉచితంగా విత్తనాలను మరియు కలుపు మందులను అందించినందుకు రైతుల తరఫున మండల వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి నూజివీడు సీడ్స్ ప్రతినిధి నరసింహారెడ్డి మరియు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఒక గుంట విస్తీర్ణంలో నిర్వహించిన పంట కోత ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి విష్ణు వర్ధన్, రజినీకాంత్, భాను శ్రీ, రైతులు , నూజివీడు కంపెనీ ప్రతినిధులు ప్రవీణ్ రెడ్డి, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.

తదుపరి వ్యాసం