TS Politics : టీఆర్ఎస్ కు మాజీ ఎంపీ షాక్ ఇవ్వనున్నారా…?
14 October 2022, 20:10 IST
- భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
Telangana Politics : మునుగోడు బైపోల్ వార్ ముందు టీఆర్ఎస్‌కు భారీ షాక్ తగలటం ఖాయంగా కనిపిస్తోంది. మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డ భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఇవాళో, రేపో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరేతారని తెలుస్తోంది.
trs ex mp boora narsaiah:బూర నర్సయ్య గౌడ్.... తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2013లో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లోనూ ఇదే స్థానం నుంచి మరోసారి పోటీ చేయగా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. బీసీ సామాజికివర్గానికి చెందిన నేతగా పేరున్న ఆయన.... మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ టీఆర్ఎస్ అధిష్ఠానం కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే అభ్యర్థిగా ఖరారు చేసింది. దీంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
టికెట్ రాలేదు.. మంత్రితో విభేదాలు...!
ఇగ గత కొంతకాలంగా జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డితో నర్సయ్య గౌడ్ కు విబేధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పలుమార్లు మంత్రిని టార్గెట్ చేస్తూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. మునుగోడు నియోజకవర్గ ప్రచారంలోనూ బూరకు ప్రాధాన్యం ఇవ్వకుండా జగీదీశ్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తూ వచ్చారు. దీనికితోడు మునుగోడు టికెట్ వస్తుందని అనుకున్నారు. చివరిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకే టికెట్ ఇవ్వటంతో... ఆయన అసంతృప్తితో ఉన్నారు. అయితే స్వయంగా కేసీఆర్.... బూర నర్సయ్య గౌడ్ ను ప్రగతి భవన్ కి పిలిచి మాట్లాడారు. అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని సూచించారు. ఈ మేరకు టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలోనూ నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు.
గత నాలుగైదు రోజులుగా తెలుగుదేశం పార్టీ తరపున బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తారన్న ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం కూడా సాగింది. ఈ వార్తలను ఆయన ఖండించారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికే పని చేస్తానని చెప్పారు. అయితే అనూహ్యంగా ఆయన ఢిల్లీకి వెళ్లటం… బీజేపీలో చేరుతారని వార్తలు రావటం… హాట్ టాపిక్ గా మారింది.