Hawala Money : మనీ మనీ మోర్ మనీ.. అంతా మునుగోడుకేనా?
Hawala Rocket In Hyderabad : హైదరాబాద్ నగరంలో ఈ మధ్య కాలంలో హవాలా డబ్బు భారీగా పట్టుబడుతోంది. హవాలా దందాకు అడ్డగా మారిందా అనేలా దొరుకుతోంది. కోట్లలో డబ్బు పట్టుబడటంతో అందరిలోనూ మునుగోడుకేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భాగ్యనగరంలో హవాలా దందా నడుస్తుందా అన్నంతగా డబ్బు దొరుకుతోంది. ఇదంతా మునుగోడు(Munugode)కే వెళ్తుందా అని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తు్న్నారు. జూబ్లీహిల్స్ లో 54 లక్షలు, మరోచోట 2.5కోట్ల రూపాయల హవాలా డబ్బు(Hawala Money) దొరికింది. బంజారాహిల్స్‌లో రూ.2 కోట్లు, చాంద్రాయణగుట్టలో రూ. 79 లక్షలు, జూబ్లీహిల్స్‌లో రూ. 2 కోట్లు ఇలా పట్టుబడుతూనే ఉంది. దీనిపై అధికారులు సైతం సీరియస్ గా ఉన్నారు. పది రోజుల వ్యవధిలోనే సుమారు 10 కోట్లకు పైగానే డబ్బు పట్టుబడింది.
మునుగోడు ఉప ఎన్నిక(Munugode Bypoll)ల వేళ ఇంతటి డబ్బు పట్టుబడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరికి వెళ్తోంది. ఎక్కడి నుంచి వస్తుందనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే.. పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేసే ఓ వ్యక్తి దగ్గర కూడా భారీగా హవాలా నగదు దొరికినట్టుగా తెలుస్తోంది.
కిందటి నెల మాసబ్‌ట్యాంక్ దగ్గరలో షోయబ్ అనే వ్యక్తి వద్ద కోటి 24లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) మీరట్‌కు చెందిన ఇతను హైదరాబాద్(Hyderabad)లో పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేస్తుంటాడు. ఇలా ఎవరెవరు హవాలా దందా సాగిస్తున్నారా అనే అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. ఓ వైపు మునుగోడు ఉపఎన్నిక జరుగుతుంటే.. ఇంతటి సొమ్ము పట్టుబడుతుండటంతో అందరిలోనూ ప్రశ్నలు మెుదలయ్యాయి.
ఇంతటి హవాలా డబ్బు.. మునుగోడుకేనా అని జనాలు చర్చించుకుంటున్నారు. ఎవరి సొమ్ము.. ఎవరి దగ్గరకు వెళ్తుందని చర్చ మెుదలైంది. మరోవైపు పార్టీలు మునుగోడు ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఖర్చు కూడా భారీగానే ఉంటుందనే.. అభిప్రాయాలు ఉన్నాయి. ఈ డబ్బంతా అక్కడికే తరలిస్తున్నారా? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.