Munugodu Bypoll: మునుగోడు బరిలో టీడీపీ..? చంద్రబాబు ప్రచారం ఉంటుందా..?
TDP in Munugodu Bypoll 2022: మునుగోడు బరిలోకి ఒక్కో పార్టీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ప్రధాన పార్టీల వంతు పూర్తి కాగా… ఇతర పార్టీలు కూడా అభ్యర్థులు ప్రకటించేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి టీడీపీ వచ్చేందుకు సిద్ధమైంది.
T- TDP To Contest in Munugodu Bypoll: రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ మునుగోడులో మక్కా వేశాయి. ఇక ఇతర పార్టీలు కూడా తమ సత్తాను చాటే పనిలో పడ్డాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా...చిన్న పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. తాజాగా బీఎస్పీ తరపు అభ్యర్థి ఖరారయ్యారు. ఇక కేఏ పాల్ పార్టీ నుంచి ప్రజాయుద్ధ నౌక గద్దర్ కూడా రేసులోకి రాబోతున్నారు. ఇప్పటివరకు ఇలా సాగుతున్న మునుగోడు పోరులోకి... ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ అభ్యర్థి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉండగానే... తెలంగాణ టీడీపీ కూడా అభ్యర్థిని ప్రకటించబోతుంది. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత పేరును ఖరారు చేసినట్లు సమాచారం.
అభ్యర్థిగా ఐలయ్య యాదవ్...!
మునుగోడు ఉప ఎన్నికకు టైం దగ్గర పడుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఓవైపు నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. మండలాలు, వార్డుల వారీగా ప్రచారం జోరందుకుంది. ఇదిలా ఉండగా మునుగోడు బై పోల్‌లో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ కూడా నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్‌ను రంగంలోకి దింపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయమై ఇవాళో, రేపో టీడీపీ అధినేత చంద్రబాబు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా బీసీ వర్గానికి చెందిన ఐలయ్య ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీ నేతగా ఆయనకు స్థానికంగా మంచి పట్టు ఉంది. ఆ నియోజకవర్గంలో బీసీ వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
చంద్రబాబు వస్తారా..?
కాగా ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థిని నెలబెట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో చంద్రబాబు వస్తారా లేదా అనే చర్చ మొదలైంది. అయితే పార్టీ అభ్యర్థి తరపున చంద్రబాబు మునుగోడులో ప్రచారం చేసే అవకాశం లేదని పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది. అయితే దీనిపై పార్టీ నాయకత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా ఈ ఉప ఎన్నికలో టీడీపీ తరఫున టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. అయినే ఈ వార్తలు నర్సయ్య గౌడ్ ఖండించారు. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని స్పష్టం చేశారు.
మొత్తంగా ప్రధాన పార్టీలతో పాటు ఇతర పక్షాలు కూడా ఎవరికివారు ప్రయత్నాల్లో మునిగిపోవటంతో మునుగోడు రాజకీయం రంజుగా మారిపోయింది. నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అయితే మునుగోడు బరిలోకి బీఎస్పీ, టీజేఎస్, ప్రజాశాంతి పార్టీలే కాకుండా తాజాగా తెలుగుదేశం కూడా కూడా రావటం పక్కా కావటంతో... ఏ పార్టీకి నష్టం చేకూరుస్తాయనే టాక్ మొదలైంది. మరీ ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే...!