Munugodu Bypoll 2022: మునుగోడులో బీఎస్పీ బీసీ అస్త్రం… అభ్యర్థి ఖరారు
munugode by election 2022: మునుగోడు ఉప ఎన్నికకు బీఎస్పీ తరపు అభ్యర్థి ఖరారు అయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
BSP Candidate for Munugode By Election 2022: రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ మునుగోడులో మక్కా వేశాయి. ఇక చిన్న పార్టీలు కూడా తమ సత్తాను చాటే పనిలో పడ్డాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా... ఇతర పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. తాజాగా బీఎస్పీ తరపు అభ్యర్థి ఖరారయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
బీఎస్పీ పార్టీ మునుగోడు ఉపఎన్నికల అభ్యర్ధిగా ఆందోజు శంకరా చారిని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాంపల్లిలో తమ పార్టీ అభ్యర్దిని ప్రకటించారు. బీసీ అభ్యర్థి అయిన ఆందోజు శంకరాచారిని బరిలోకి దింపుతున్నట్లు తెలిపారు. పార్టీలన్ని అగ్రవర్ణమైన రెడ్డి సామాజికవర్గ నేతలకు టికెట్లు కేటాయించాయని కానీ… తాము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం దిశగా పనిచేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఇక మునుగోడు బై పోల్ లో ముగ్గురు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే ఈ ముగ్గురు పాత ప్రత్యర్థులే అయినప్పటికీ మారిన రాజకీయ పరిమాణామాల దృష్యా పోటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి బరిలోకి దిగారు. ఇక కాంగ్రెస్ నుండి పాల్వాయి స్రవంతికి అధిష్టానం టికెట్ కేటాయించింది. అభ్యర్థి విషయంలో చివరి వరకు వేచి చూసిన టీఆర్ఎస్... ఫైనల్ గా మాజీ ఎమ్మెల్యే, ఇంఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఇచ్చింది. ఇక్కడ కమ్యూనిస్టులు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించారు.
మరోవైపు కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ నుంచి ప్రజాయుద్ధ నౌక గద్దర్ బరిలో ఉండటం మరో ఆసక్తికర విషయం. ఆయన కూడా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వైఎస్ఆర్టీపీ పోటీ చేసే పరిస్థితి కనిపించటం లేదు. అయితే తెలంగాణ తెలుగుదేశం మాత్రం అభ్యర్థిని నిలబెట్టే పనిలో ఉన్నట్లు సమాచారం. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని బరిలో నిలపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ప్రధాన పార్టీల అభ్యర్థలందరూ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే ఉన్నారు. అయితే బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఇక్కడ అత్యధికంగా ఉన్నారు. ఈ వర్గాలకు చెందిన కొన్ని సంఘాలు, మేధావులు ప్రధాన పార్టీల తీరును తీవ్రంగా ఖండించాయి. మెజార్టీ జనాభా ఉన్న వర్గాలకు కాకుండా… తక్కువ జనాభా శాతం ఉన్న వారికి ఎలా టికెట్లు కేటాయించారని ప్రశ్నిస్తున్నారు.
సామాజికవర్గాల వారీగా...
గౌడ్ - 35,150 మంది 15.94%
ముదిరాజ్- 33, 900 (15.37శాతం)
ఎస్సీ మాదిగ - 25 ,650 మంది (11.6 3 శాతం)
యాదవ - 21, 360 (ఓటు షేర్ 9.69)
పద్మశాలీలు - 11, 680 (ఓటు శాతం 5.30 శాతం)
ఎస్టీ లంబాడి/ ఎరుకల - 10,520 మంది (4.7 శాతం)
ఎస్సీ (మాల)- 10,350 మంది
వడ్డెర - 8,350 మంది
కుమ్మరి -7,850 మంది ఓటర్లు,
విశ్వబ్రాహ్మణ/ విశ్వకర్మ- 7,820
రెడ్డి- 7,690 మంది
ముస్లింలు - 7,650
కమ్మ - 5,680 మంది
ఆర్య వైశ్య - 3,760 మంది
వెలమ - 2,360 మంది,
మున్నూరు కాపు - 2,350 మంది,
ఇతరులు 18,400 మంది
నియోజకవర్గంలో మొత్తం - 2,00,956 ఓట్లు