Munugodu Bypoll: మునుగోడులో కాకరేపుతున్న 'కాంట్రాక్ట్' పాలిటిక్స్-hot topic on komatireddy rajagopal reddy contract issue in munugodu bypoll
Telugu News  /  Telangana  /  Hot Topic On Komatireddy Rajagopal Reddy Contract Issue In Munugodu Bypoll
కాకరేపుతున్న కాంట్రాక్ట్ అంశం
కాకరేపుతున్న కాంట్రాక్ట్ అంశం

Munugodu Bypoll: మునుగోడులో కాకరేపుతున్న 'కాంట్రాక్ట్' పాలిటిక్స్

12 October 2022, 7:01 ISTHT Telugu Desk
12 October 2022, 7:01 IST

Munugodu Bypoll 2022: మునుగోడు రాజకీయం రోజురోజుకూ ముదురుతోంది. బైపోల్ కు టైం దగ్గరపడుతున్న వేళ... పాలిటిక్స్ అంతా ఒక్క అంశమే చుట్టే తిరుగుతోంది. ఈ విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు అన్నీ పక్షాలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి.

contract issue in munugodu bypoll 2022: 18 వేల కాంట్రాక్ట్... ఈ పదం చుట్టే మునుగోడు రాజకీయమంతా తిరుగుతోంది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ గా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు తీవ్రతరం చేస్తున్నాయి. అంతేకాదు మిగతా పక్షాలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. కేవలం కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారంటూ ఆరోపిస్తున్నారు. బైపోల్ ముందే నుంచే కాంట్రాక్ట్ అంశం తెరపైకి వచ్చినప్పటికీ... తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత... కాంట్రాక్ట్ టాపిక్ పైనే చర్చ ఓ లెవల్ లో నడుస్తోంది.

టీఆర్ఎస్ సరికొత్త సవాల్....

మునుగోడు బైపోల్ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ సరికొత్త సవాల్ విసురుతోంది. రాజగోపాల్ రెడ్డికి 18వేల కాంట్రాక్ట్ ఇవ్వటం కాదని.... నల్గొండ, మునుగోడు అభివృద్ధికి రూ.18 వేల కోట్లు ఇస్తే ఉప ఎన్నిక బరి నుంచి వైదొలుగుతామని బీజేపీకి సవాల్ చేస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి వ్యక్తిగతంగా కాంట్రాక్టుల రూపంలో ఇచ్చిన సొమ్ము మునుగోడు అభివృద్ధికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. రాజగోపాల్​రెడ్డికి ఇచ్చే సొమ్ము జిల్లా అభివృద్ధికి ఇస్తే.. ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటామంటూ సవాళ్లను విసురుతోంది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది. కేవలం కాంట్రాక్ట్ కోసమో పార్టీ మారారని ఆరోపిస్తోంది. రాజకీయంగా అన్ని అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి... ఒక్క కాంట్రాక్ట్ కోసం పార్టీ మారారని అంటోంది. ప్రచారంలోనూ ఇదే విషయాన్ని తెగ ప్రచారం చేస్తోంది. రాజగోపాల్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును కూడా విమర్శిస్తూ ముందుకెళ్తోంది. రెండు పార్టీలు విపరీతమైన డబ్బులను ఖర్చు చేస్తూ... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయంటూ విమర్శలు గుపిస్తోంది. ఇక టీఆర్ఎస్ తో జతకట్టిన కమ్యూనిస్టు పార్టీలు కూడా రాజగోపాల్ రెడ్డిపై ఫైర్ అవుతున్నాయి. కాంట్రాక్ట్ ల కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి తమ కమ్యూనిస్టు పార్టీలను విమర్శించే హక్కు లేదంటూ దుయ్యబడుతున్నారు.

ఇదిలా ఉంటే... బీజేపీ నేతలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి. టెండర్ల ప్రకారమే రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్ట్ దక్కిందని చెప్పుకొస్తున్నాయి. గ్లోబల్ టెండర్లలో భాగంగానే ఆయనకు దక్కిందని అంటున్నారు. కేవలం మునుగోడు అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ విమర్శలను ప్రజలు పట్టించుకోవటం లేదని... ఈ ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించటం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా చండూరు మండల కేంద్రంలో కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కాంట్రాక్ట్ పే అంటూ పోస్టర్లు కలకలం రేపాయి. ఇది చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా టీఆర్ఎస్ పనేనంటూ బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తంగా మునుగోడు బైపోల్ వార్ కాంట్రాక్ట్ అంశమే చుట్టే తిరుగుతోంది. అధికార టీఆర్ఎస్ మాత్రం... దీన్ని ప్రచార అస్త్రంగా మార్చుకోవాలని చూస్తూ... బీజేపీని ఎండగట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ కాక ఎలాంటి అంశాలను ప్రభావితం చేస్తోంది..? గెలుపు ఓటమిలను డిసైడ్ చేస్తుందా...? అన్న చర్చ కూడా మొదలైంది.