Fire Accident In Congress Office : చండూరు కాంగ్రెస్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం….-fire accident in munugode congress office ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Fire Accident In Munugode Congress Office

Fire Accident In Congress Office : చండూరు కాంగ్రెస్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం….

B.S.Chandra HT Telugu
Oct 11, 2022 11:34 AM IST

Fire Accident In Congress Office నల్గొండ జిల్లా మునుగోడు నియోజక వర్గం చండూరు కాంగ్రెస్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాల కోసం చండూరులో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ప్రచార సామాగ్రి కాలి బూడిదైంది. పత్యర్ధులు ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌ కార్యాలయాలపై దాడులు చేసి పార్టీ శ్రేణుల్ని బెదిరించాలని చూస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

చండూరు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంటలు (ఫైల్)
చండూరు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంటలు (ఫైల్) (ANI)

Fire Accident In Congress Office నల్గొండ జిల్లా మునుగోడు నియోజక వర్గం చండూరు కాంగ్రెస్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. బీజేపీ, టిఆర్‌ఎస్‌ శ్రేణులే కాంగ్రెస్‌ కార్యాలయంపై దాడి చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరిన సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారానికి కొద్ది సేపటి ముందు చండూరులో పార్టీ కార్యాలయం దగ్ధమైంది. మునుగోడు ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి రెడ్డి చండూరులో కూడా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. సోమవారం అర్ధరాత్రి వరకు పార్టీ కార్యాలయంలో ఉన్న కార్యకర్తలు సోమవారం రాత్రి 11 దాటాక ఇళ్లకు వెళ్లిపోయారు. తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయానికి నిప్పు పెట్టినట్టు అనుమానిస్తున్నారు. పార్టీ ప్రచారానికి సంబంధించిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు కాలి బూడిదయ్యాయి.

మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక దాడి చేశారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ క్యాడర్‌ను భయపెట్టడానికే కార్యాలయానికి నిప్పు పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 24 గంటల్లో నిందితుల్ని పట్టుకోపోతే ఎస్పీ ఆఫీసు ముందు ధర్నాకు దిగుతానని రేవంత్ హెచ్చరించారు. జెండా దిమ్మలు పగులగొట్టినా, పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టినా మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండాయేనని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

చండూరు మండల కేంద్రంలో ఉన్న పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం మంటలు రావడాన్ని సమీపంలో ఉన్న వారు గుర్తించి కాంగ్రెస్ శ్రేణులకు సమాచారం ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు తలుపులు తెరిచి చూసే సరికి లోపల ఉన్న ప్రచార సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. దీంతో పార్టీ కార్యాలయం వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. చండూరులో ఎన్నికల నిర్వహణ కోసం తీసుకున్న పార్టీ కార్యాలయాన్ని కొత్తగా వైరింగ్ చేయించినట్లు నేతలు చెబుతున్నారు.

తెల్లవారుజామున 4గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చెబుతున్నారు. రాత్రి 11గంటల వరకు కార్యాలయంలో కార్యకర్తలు ఉన్నారని, అర్థరాత్రి రదాటాక ప్రత్యర్ధులు మండే పదార్ధాలను లోపలకు విసిరి నిప్పంటించి ఉంటారని ఆరోపించారు. పార్టీ కార్యాలయానికి ఉన్న కిటికీలు తెరిచి లోపలకు నిప్పు వేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేదని, ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

IPL_Entry_Point