TGPSC Group 2 Updates : తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - వెబ్ సైట్ లో మళ్లీ 'ఎడిట్ ఆప్షన్' - చివరి తేదీ ఇదే..!
15 June 2024, 5:16 IST
- TGPSC Group 2 Updates : గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తుల ఎడిట్ కు మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ గ్రూప్ 2 రిక్రూట్ మెంట్ అప్డేట్స్
TSPSC Group 2 Application Updates : ఎన్నికల కోడ్ ముగియటంతో ఉద్యోగాల భర్తీపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తికాగా.. మెయిన్స్ షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. ఇదే సమయంలో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీపై కూడా కసరత్తు షురూ చేసింది. ఇందులో భాగంగా అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది.
గ్రూప్ 2 అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. జూన్ 16వ తేదీ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ ఆప్షన్ తో జూన్ 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు దరఖాస్తులను ఎడిట్ చేసుకునే వీలు ఉంటుందని స్పష్టం చేసింది.
అభ్యర్థులకు ఇదే చివరి అవకాశమని… ఎవరైనా అభ్యర్థులు తప్పిదాలు చేస్తే సరి చేసుకోవాలని కమిషన్ సూచించింది. ఎడిట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా తమ దరఖాస్తును PDF ఫార్మాట్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది.
https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ అప్లికేషన్ ను ఎడిట్ చేసుకోవచ్చు. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు(TSPSC Group 2) ఉంటాయని గతంలోనే కమిషన్ తెలిపింది.ఇక గ్రూప్2 కింద 783, గ్రూప్ 3 కింద 1388 పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
తొలుత ఆగస్టు 29, 30న గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. వరుసగా గ్రూప్-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేసింది కమనషన్.
నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూలు చేసింది టీఎస్పీఎస్సీ. కానీ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మళ్లీ కొత్త తేదీలను ప్రకటించారు. ఇందులో భాగంగా… ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉంటాయని మార్చి నెలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి ప్రకటన చేసింది.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ కీ విడుదల…
TSPSC Group 1 Prelims Answer key : తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఇటీవలే పరీక్ష పూర్తికాగా… ఇందుకు సంబంధించి ప్రిలిమినరీ కీ విడుదలైంది. అంతేకాకుండా…. మాస్టర్ ప్రశ్నపత్రం కూడా అందుబాటులోకి వచ్చింది.
ప్రాథమిక కీ తోపాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని https:// www.tspsc.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీ కి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే… జూన్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఇంగ్లీష్ లో మాత్రమే సమర్పించాలని కమిషన్ సూచించింది. అభ్యర్థులు తమ క్లెయిమ్‌లను ధృవీకరించేందుకు తగిన ఆధారాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపింది. వెబ్ సైట్ పొందుపరిచిన అభ్యంతరాలను మాత్రమే పరిగణిస్తామని, ఇ-మెయిల్స్, వ్యక్తిగతంగా సమర్పించిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోమని కమిషన్ స్పష్టం చేసింది.
జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత… ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించనున్నారు. మరోవైపు… మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్:
గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.షెడ్యూల్ వివరాలు చూస్తే….
- జనరల్ ఇంగ్లిష్(క్వాలిఫైయింగ్ పేపర్) - అక్టోబర్ 21
- పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22
- పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) - అక్టోబర్ 23
- పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) - అక్టోబర్ 24
- పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) - అక్టోబర్ 25
- పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) - అక్టోబ్ 26
- పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) - అక్టోబర్ 27.