తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Formula E Race Case : ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో కీలక పరిణామం - కేటీఆర్ పై కేసు నమోదు చేసిన ఈడీ

Formula E Race Case : ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో కీలక పరిణామం - కేటీఆర్ పై కేసు నమోదు చేసిన ఈడీ

20 December 2024, 21:52 IST

google News
    • ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఏసీబీ కేసు నమోదు ఆధారంగా.. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి పేర్లను పేర్కొంది.
ఈడీ కేసు నమోదు
ఈడీ కేసు నమోదు

ఈడీ కేసు నమోదు

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చేసుకుంది. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేయగా… ఇందులో కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి పేర్లు ఉన్నాయి.

ఏసీబీ ఎఫ్ఐఆర్‌లో ఉన్న అంశాలను ఈడీ పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయాలనే ఈసీఐఆర్(Enforcement Case Information Report) లో పేర్కొంది. ఈడీ ఎంట్రీతో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

ఏసీబీ నుంచి సమాచారం…

ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై తెలంగాణ ఏసీబీ గురువారమే కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్ పేరును ఏ1గా చేర్చింది. అయితే ఈ కేసుకు సంబంధించిన సమాచారం కోసం తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాసినట్టు తెలిసింది. 

నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరింది. ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు హెచ్ఎండీఏ అకౌంట్‌ నుంచి.. ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని ఈడీ కోరినట్టు తెలిసింది. దాన కిశోర్‌ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని ఈడీ అధికారులు కోరారు. అలాగే ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించి ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. వీటి ఆధారంగానే… ఇవాళ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.

సరైన అనుమతులు లేకుండా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిధుల నుండి.. ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు రూ.55 కోట్లు బదిలీ చేశారు. దీని చుట్టూ ఈ కేసు తిరుగుతుంది. ఈ నేపథ్యంలో.. అవినీతి నిరోధక శాఖ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేటీఆర్‌ను ఏ1గా చేర్చింది. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌ను ఏ2గా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా చేర్చింది.

హైకోర్టు కీలక ఆదేశాలు:

ఫార్ములా ఈకార్ రేసింగ్ వ్యవహారంలో తనపై కేసు పెట్టడాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించగా.. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.

ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… డిసెంబర్ 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఈకేసులో కేటీఆర్‌పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్‌, 409, 120B కింద కేసు నమోదు చేశారు. దీనిపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించటంతో ఊరట దక్కింది.

తదుపరి వ్యాసం