తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Dsc Recruitment 2024 : టీచర్ ఉద్యోగానికి ఎంపికయ్యారా..! ఈ ముఖ్యమైన 10 విషయాలను తెలుసుకోండి

TG DSC Recruitment 2024 : టీచర్ ఉద్యోగానికి ఎంపికయ్యారా..! ఈ ముఖ్యమైన 10 విషయాలను తెలుసుకోండి

12 October 2024, 12:10 IST

google News
    • Telangana DSC Recruitment 2024 : తెలంగాణలో డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇటీవలే ఉద్యోగాలకు ఎంపికైన 10,006 మందికి ఉపాధ్యాయ ఉద్యోగ నియామకపత్రాలను అందించారు. దాదాపు వీరంతా స్థానికంగా ఉండే డీఈవో కార్యాలయాల్లో రిపోర్టింగ్ చేశారు. ఏ క్షణమైనా కౌన్సిలింగ్ ప్రకటన రానుంది.
తెలంగాణ డీఎస్సీ ఉద్యోగాలు 2024
తెలంగాణ డీఎస్సీ ఉద్యోగాలు 2024

తెలంగాణ డీఎస్సీ ఉద్యోగాలు 2024

తెలంగాణలో కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు.. త్వరలోనేై విధుల్లో చేరనున్నారు. గత వారం ఎల్బీ స్టేడియం వేదికగా ఎంపికైన 10,006 మందికి నియామకపత్రాలను అందజేశారు. మరునాడు వెంటనే సదరు అభ్యర్థులు… డీఈవో కార్యాలయాలకు వెళ్లి రిపోర్టింగ్ చేశారు. అయితే వీరికి అందే జీతాలు, కౌన్సెలింగ్, పోస్టింగ్ వంటి పలు కీలక అంశాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ చూడండి….

కొత్త టీచర్లు - ముఖ్యమైన అంశాలు:

  • ఈ ఏడాది ఇచ్చిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా అక్టోబర్ 09వ తేదీన 10,006 మంది టీచర్లకే బుధవారం నియామక ఉత్తర్వులిచ్చారు.
  • అక్టోబర్ 10వ తేదీన దాదాపుగా వీరంతా జిల్లా కేంద్రాల్లో ఉండే డీఈవో కార్యాలయాల్లో రిపోర్టింగ్ చేశారు.
  • కొత్తగా ఎంపికైన టీచర్లకు అక్టోబర్ 10వ తేదీ నుంచి జీతాలను లెక్కకట్టనున్నారు. ఈ తేదీని ప్రామాణికంగా తీసుకొని జీతాలను జమ చేస్తారు. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ల వివరాలను తీసుకుంటున్నారు.
  • నియామకపత్రాలను అందుకున్న అభ్యర్థులకు ఏ క్షణమైనా కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.
  • ఇప్పటికే జిల్లాల్లో ఖాళీలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.
  • కౌన్సెలింగ్ తేదీలు ఖరారు అయితే… కొత్తగా ఎంపికైన టీచర్లు ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థుల ఆప్షన్లు, ఖాళీలను పరిశీలించి… పని చేయాల్సిన పాఠశాలను విద్యాశాఖ ఖరారు చేస్తుంది.
  • ఎస్జీటీ పోస్టులకు ఎంపికైన వారికి మొత్తం జీతం రూ. 43,068గా నిర్ణయించారు. బేసిక్ పే 31,040, హెచ్‌ఆర్‌ఏ (11%) రూ.3,414, డీఏ (22.75%) 7,062, ఐఆర్‌ రూ.1,552గా ఉంది.
  • స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు ఎంపికైన వారికి జీతం రూ. 58,691గా ఉంది. బేసిక్ పే రూ. 42,300గా ఉంది. హెచ్‌ఆర్‌ఏ (11%) రూ.4,653, డీఏ (22.75%) రూ.9,623, ఐఆర్‌ రూ.2,115గా నిర్ణయించారు.
  • దసరా సెలవులు అక్టోబర్ 13వ తేదీతో పూర్తి అవుతాయి. 14వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. కొత్త టీచర్లు విధుల్లోకి వస్తే దాదాపు 7 వేల మందికిపైగా ఉపాధ్యాయులు పని చేస్తున్న స్థానాల నుంచి రిలీవ్ అవుతారు. కొత్త టీచర్లు వస్తే వారు బదిలీ అయిన చోటుకు వెళ్లాల్సి ఉంది. వచ్చే వారంలోపు కొత్త టీచర్లు విధుల్లో చేరే అవకాశం ఉంది.

విద్యాశాఖలోని మరికొన్ని టీచర్ ఖాళీల భర్తీకి తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ లో ఏమైనా ఖాళీలు ఉంటే… వాటిని కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం… వచ్చే నెల(నవంబర్)లో టెట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. టెట్ రాత పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తారు. ఇక డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రకటన ఫిబ్రవరి 2025లో ఇస్తారు. అప్లికేషన్ల స్వీకరణ తర్వాత ఏప్రిల్ 2025లో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ లో 5 నుంచి 6వేల మధ్య టీచింగ్ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం