Telangana Appulu : తెలంగాణలో ఒక్కో కుటుంబంపై అప్పు ఎంత ఉందో తెలుసా.. షాక్ అవుతారు!
Telangana Appulu : తెలంగాణలో అప్పుల గురించి నాబార్డ్ సర్వేలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఆదాయం పెరిగినా మిగులు తగ్గుతుందని నాబార్డ్ సర్వేలో తేలింది. అత్యధికంగా అప్పుల్లో ఉన్నది తెలంగాణ వాసులేనని నాబార్డ్ తేల్చి చెప్పింది. ఒక్కో కుటుంబంపై అప్పు భారం లక్షకు పైనే ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున లక్షా 29 వేల 599 రూపాయల అప్పు ఉంది. నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య 79 శాతం నుంచి 92 శాతానికి పెరిగింది. తెలంగాణలోని ఒక్కో కుటుంబ నెలవారీ సగటు ఆదాయం రూ.7,811 నుంచి రూ.12,065కి పెరిగింది. జాతీయ సగటు రూ.8,059 నుంచి రూ.12,698కి చేరిందని నాబార్డ్ సర్వే వెల్లడించింది.
తెలంగాణలో వ్యవసాయ కుటుంబ నెలవారీ సగటు ఆదాయం రూ.8,951 నుంచి రూ.13,874 కి చేరింది. జాతీయ సగటు రూ.8,931 నుంచి రూ.13,661కి పెరిగింది. ప్రస్తుతం అత్యధికంగా పంజాబ్‌లో ఒక్కో రైతు కుటుంబానికి రూ.31,433 ఆదాయం ఉంది. కుటుంబం నెలవారీ సగటు మిగులు ఇదివరకు రూ.998 ఉండగా.. ఇప్పుడు రూ.781కి పడిపోయింది.
2021-22 వ్యవసాయ సంవత్సరంలో రుణం తీసుకున్న కుటుంబాలు 73 శాతంగా ఉన్నాయి. జాతీయ సగటు 42 శాతం మాత్రమే ఉంది. వ్యవసాయ రుణాల విషయంలో ఏపీ, తెలంగాణ తొలి రెండు స్థానాలలో ఉన్నాయి. అదే సమయంలో.. కుటుంబ నెలవారీ సగటు వినియోగ వ్యయం రూ.6,813 నుంచి రూ.11,284 కి చేరింది. జాతీయ సగటు రూ.6,646 నుంచి రూ.11,262 ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని 54 శాతం కుటుంబాలు ఎంతో కొంత పొదుపు చేస్తున్నాయి. పొదుపు విషయంలో జాతీయ సగటు 66 శాతంగా ఉంది. రాష్ట్రంలో 92 శాతం కుటుంబాలు గ్రామాల్లో, 8 శాతం సెమీ అర్బన్ ప్రాంతంలో ఉన్నట్లు నాబార్డ్ సర్వే వెల్లడించింది. వ్యవసాయ కుటుంబాలు 55 శాతం, వ్యవసాయేతర కుటుంబాలు 45 శాతం ఉన్నాయి.
తెలంగాణలోని 20 శాతం కుటుంబాలు ఏదో ఒక రంగంలో పెట్టుబడి పెడుతున్నాయి. ఈ విషయంలో జాతీయ సగటు 27 శాతంగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అత్యధికంగా 36 శాతం కుటుంబాలు పెట్టుబడులు పెడుతున్నాయని నాబార్డ్ సర్వే వివరించింది. తెలంగాణలోని 58.2 శాతం కుటుంబాల్లో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు ఉన్నారు. వీటి ద్వారా పొదుపు, అప్పులు సులభతరం అయ్యాయి.