Ancient Foods India : సంకల్పమే పెట్టుబడి- మిల్లెట్​ స్నాక్స్​తో అందరికి ఆరోగ్యమే ఈ హరిత లక్ష్యం!-motivating journey of lakshmi haritas ancient foods india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ancient Foods India : సంకల్పమే పెట్టుబడి- మిల్లెట్​ స్నాక్స్​తో అందరికి ఆరోగ్యమే ఈ హరిత లక్ష్యం!

Ancient Foods India : సంకల్పమే పెట్టుబడి- మిల్లెట్​ స్నాక్స్​తో అందరికి ఆరోగ్యమే ఈ హరిత లక్ష్యం!

Sharath Chitturi HT Telugu
Sep 29, 2024 01:01 PM IST

Ancient foods india : హైదరాబాద్​కు చెందిన లక్ష్మీ హరిత ఏన్షియంట్​ ఫుడ్స్​ ఇండియా అనే కంపెనీని స్థాపించారు. భారతీయ సాంప్రదాయ స్నాక్స్​ని విక్రయిస్తూ ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు.

కంపెనీ ఉద్యోగులతో లక్ష్మీ హరిత..
కంపెనీ ఉద్యోగులతో లక్ష్మీ హరిత..

‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అని అంటారు. కానీ ఈ కాలంలో మనం తింటున్న ఆహారాల్లో పోషకాలు, నాణ్యత ఉండటం లేదు. ఈ పరిస్థితులను మార్చి, ప్రజల్లో అవగాహన నింపి, ఇండియాని ఆరోగ్య భారత్​గా తీర్చిదిద్దేందుకు కొందరు సైలెంట్​గా కృషి చేస్తున్నారు. వారిలో ఒకరు హైదరాబాద్​కు చెందిన వ్యాపారవేత్త లక్ష్మీ హరిత. ఏన్షియంట్ ఫుడ్స్ ఇండియా పేరిట తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మిల్లెట్ ఆధారిత, తినడానికి సిద్ధంగా ఉన్న అల్పాహార తయారీలో ప్రత్యేకత కలిగిన సంస్థ ఇది. దోశ మిక్సర్, పొంగల్ మిక్సర్, నమ్కీన్ వంటి భారతీయ సాంప్రదాయ స్నాక్స్​ని ఈ సంస్థ తయారు చేస్తుంది. ఈ సెప్టెంబర్​ నెలని ‘నేషనల్​ న్యూట్రీషియన్​ మంత్​’గా కేంద్ర గుర్తించిన నేపథ్యంలో లక్ష్మీ హరిత కథను ఇక్కడ తెలుసుకుందాము..

సవాళ్లను అధిగమించి..

లక్ష్మీ హరిత ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పట్టా పొందారు. తరువాత ఆమె కొన్ని సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, సోలార్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. ఈ సమయంలో, ఆమె మార్కెట్​లో ఆరోగ్యకరమైన ఆహార ఎంపికల కొరతను గుర్తించారు. ఆరోగ్య-కేంద్రీకృత ఆహార వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రణాళిక చేశారు. అదనంగా, ఆమె ఫుల్​ టైమ్​ ఉద్యోగాన్ని చేయటం, తన నాలుగు నెలల కొడుకును చూసుకోవడం సవాలుగా మారింది. కానీ ఆమె సవాలును స్వీకరించారు. ఒత్తిడిలోనూ విజయం సాధించారు. మిల్లెట్ ఆధారిత తక్షణ అల్పాహారం, స్నాక్ మిక్స్‌లను ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించే వెంచర్‌ను ప్రారంభించడానికి ఈ సవాళ్లు ఆమెను మరింత ప్రేరేపించాయి. వ్యవసాయ శాఖలో పనిచేసిన ఆమె తల్లి కూడా ఆమెకు స్ఫూర్తిగా నిలిచారు.

దాదాపు 3 లక్షల సొంత పెట్టుబడితో ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తన వ్యాపారాన్ని బాగా నడపడానికి, పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి కొంతకాలం పాటు ఆమె ఆర్థిక అవసరాల కోసం అన్వేషించారు. అదే సమయంలో లక్ష్మి హరితకు భారతీయ యువ శక్తి ట్రస్ట్​ (బీవైఎస్​టీ) గురించి తెలిసింది. బీవైఎస్​టీ హైదరాబాద్ కార్యాలయాన్ని సందర్శించి తన ఆలోచనలను పంచుకున్నారు. ప్రాజెక్ట్ నివేదికను తయారు చేయడంలో ఆమెకు బీవైఎస్​టీ మద్దతునిచ్చింది. ఇతర ప్రక్రియలు, డాక్యుమెంటేషన్‌ను సులభతరం చేసింది. ఆమెకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 19.7 లక్షలు రుణం పొందడంలో తోడ్పడింది. ఈ డబ్బును యూనిట్‌ని స్థాపించడానికి, దాని కోసం ముడిసరుకు కొనుగోలు చేయడానికి ఈ డబ్బును ఆమె ఉపయోగించారు. బీవైఎస్​టీ కూడా వన్- టు- వన్ మెంటార్‌ని కేటాయించడంతో పాటు హైటెక్స్ ఎక్స్‌పో, దిల్లీ వరల్డ్ ఫుడ్ ఇండియా మొదలైన వివిధ ఈవెంట్‌లు, ఎక్స్‌పోల్లో ఆమె ఉత్పత్తులను ప్రదర్శించడానికి అవకాశాలను అందించింది. ఈ విధంగా ఆమెకు ఎంతో మద్దతు ఇచ్చింది.

లక్ష్మీ హరిత స్థాపించిన ఏన్షియంట్​ ఫుడ్స్​ ఇండియా హైదరాబాద్​లో ఉంది. ఇందులో ప్రస్తుతం 20మంది ఉద్యోగులు ఉన్నారు. 2023-24 ఆర్థిక ఏడాదిలో ఈ కంపెనీ రూ. 30లక్షల టర్నోవర్​ని సంపాదించింది.

భారతదేశంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ద్వారా ఆమె కంపెనీ.. టాప్ 100 స్టార్టప్స్​లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆమె వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా మిల్లెట్ ఆధారిత ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడం, అవగాహన కల్పించడం కోసం ఆన్-వీల్ స్టోర్లను ప్రారంభించారు. ఆమె తన ఉత్పత్తులను విక్రయించడానికి అమెజాన్, జియోమార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా ఉపయోగిస్తున్నారు.

సంబంధిత కథనం