తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr : మణిపూర్ తరహాలో లగచర్ల ఘటన, గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండ- దిల్లీలో కేటీఆర్ విమర్శలు

KTR : మణిపూర్ తరహాలో లగచర్ల ఘటన, గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండ- దిల్లీలో కేటీఆర్ విమర్శలు

18 November 2024, 22:27 IST

google News
  • KTR : మణిపూర్ హింసాకాండ తరహాలో తెలంగాణలోని లగచర్లలో గిరిజనులపై అధికార కాంగ్రెస్, పోలీసులు దమనకాండకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. గిరిజన మహిళలపై దాడుల గురించి ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు.

మణిపూర్ తరహాలో లగచర్ల ఘటన, గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండ- దిల్లీలో కేటీఆర్ విమర్శలు
మణిపూర్ తరహాలో లగచర్ల ఘటన, గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండ- దిల్లీలో కేటీఆర్ విమర్శలు

మణిపూర్ తరహాలో లగచర్ల ఘటన, గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండ- దిల్లీలో కేటీఆర్ విమర్శలు

కొడంగల్, లగచర్ల గిరిజన రైతులపై కాంగ్రెస్ సర్కార్ దురాగతాలు, పోలీసుల దమనకాండపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ ఎందుకు స్పందించటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్....కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు. మణిపూర్ లో జరిగిన సంఘటనల కన్నా.. లగచర్ల ఘటన ఏమాత్రం తక్కువ కాదన్నారు. జాతీయ మీడియా కూడా తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు, దమన కాండను చూపించాలని కోరారు.

తెలంగాణలో గిరిజన మహిళలు, రైతులపై రేవంత్ రెడ్డి సర్కార్ అఘాయిత్యాలకు పాల్పడుతోందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో గిరిజనులు ఎదుర్కొంటున్న వేధింపులను ఎత్తిచూపారు. గిరిజన మహిళలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలను దేశానికి తెలియజేసేందుకు దిల్లీకి వచ్చామని కేటీఆర్ తెలిపారు. రైతులు, వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనుల సంక్షేమం గురించి కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ తరచూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ లగచర్ల విషయాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నిత్యం ఈ సమస్యలపై మాట్లాడుతున్నారు కానీ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో గిరిజనుల బాధలపై ఎందుకు మౌనంగా ఉన్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.

50-60 ఏళ్లుగా అక్కడ జీవిస్తున్నామని, ప్రాణం పోయినా.. మా భూములు ఇవ్వమని లగచర్ల బాధితులు అంటున్నారని కేటీఆర్ తెలిపారు. అర్ధరాత్రి అరెస్టులు, శారీరక హింసలు, లైంగిక వేధింపులతో సహా పోలీసుల క్రూరత్వానికి లగచర్ల ఘటన ఉదాహరణ అన్నారు. పోలీసులు అర్ధరాత్రి వచ్చి ప్రజలను అరెస్టు చేసి, మహిళలపై లైంగిక వేధింపులకు గురిచేశారని, శారీరకంగా హింసించారని కేటీఆర్ ఆరోపించారు.

కొందరు మద్యం మత్తులో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు అర్ధరాత్రి దాడులకు పాల్పడ్డారన్నారు. జ్యోతి అనే గర్భిణి విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఆమె భర్తను అకారణంగా కొట్టి అరెస్టు చేశారని ఆరోపించారు.

ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూములను అప్పగించేందుకు వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ‘మీ అల్లుడి ఫార్మా కంపెనీ కోసం మా భూమిని పోగొట్టుకోవాలా’ అని గిరిజనులు అడుగుతున్నారని కేటీఆర్ అన్నారు. మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, ఈ చర్యలలో పోలీసుల ప్రమేయం ఉందన్నారు. యువతులను కొట్టే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.

బాధితులు న్యాయం కోరుతూ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ/ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్‌తో సహా వివిధ మానవ హక్కుల సంఘాలను ఆశ్రయించారు. తమ భూములు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారని కేటీఆర్ అన్నారు. కొంతమంది "మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ మేము మా భూమిని ఇవ్వము" అని అంటున్నారన్నారు. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం వల్ల బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్‌ మండిపడ్డారు. సీఎం సోదరుడు రైతులను బెదిరించి దౌర్జన్యాలు చేస్తున్నప్పటికీ ఆయనపై ఇంతవరకు కేసులు పెట్టలేదని మండిపడ్డారు. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని, రేవంత్ రెడ్డి సోదరుడికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ పరిస్థితిని, మణిపూర్‌లో జరిగిన హింసాకాండతో పోలుస్తూ.. జాతీయ మీడియా దీనిపై దృష్టిపెట్టాలన్నారు. మణిపూర్‌లో జరిగిన హింసాకాండ, యూపీ ఆసుపత్రుల్లో చిన్నారుల మరణాలు, ముంబైలోని ధారవిలో ప్రజల బాధలను మీడియా కవర్ చేస్తుంటే, తెలంగాణలో గిరిజనులపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. "ఈ దేశంలోనే తెలంగాణ ఒక రాష్ట్రమని ప్రధాని మర్చిపోయారా? ఇక్కడ జరుగుతున్న దారుణాలపై స్పందించకూడదా?" ఇరువురు నేతలు మౌనంగా ఉండకుండా వ్యవహరించాలని కేటీఆర్ కోరారు.

తదుపరి వ్యాసం