తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Police : వరంగల్​ కమిషనరేట్​ లో 7 శాతం పెరిగిన క్రైమ్​ రేట్​

Warangal Police : వరంగల్​ కమిషనరేట్​ లో 7 శాతం పెరిగిన క్రైమ్​ రేట్​

HT Telugu Desk HT Telugu

26 December 2023, 22:26 IST

google News
    • Warangal Police Commissionerate:వరంగల్ కమిషనరేట్ లో 7.71 శాతం క్రైమ్ రేటు పెరిగింది.  దొంగతనాలతో పాటు మహిళలపై దాడులు ఎక్కువయ్యాయి. ఈ మేరకు నగర సీపీ వార్షిక నివేదిక వివరాలను వెల్లడించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్
వరంగల్ పోలీస్ కమిషనరేట్

వరంగల్ పోలీస్ కమిషనరేట్

Warangal Police Commissionerate News: వరంగల్ కమిషనరేట్ లో క్రైమ్ రేట్ పెరిగిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 7.71 శాతం నేరాలు పెరిగిపోయాయి. నిరుడు మొత్తంగా 13 వేలకు పైగా కేసులు నమోదు కాగా ఈసారి 14,530 కేసులు నమోదు అయ్యాయి. వరంగల్ నగరంతో పాటు కమిషనరేట్ వ్యాప్తంగా ముఖ్యంగా మహిళలు, పిల్లలపై దాడులు పెరిగిపోగా.. దోపిడీలు, దొంగతనాల సంఖ్యకూడా ఎక్కువైంది.

ఈ మేరకు సంవత్సర కాలంగా వరంగల్ కమిషనరేట్ లో జరిగిన నేరాలకు సంబంధించిన వార్షిక నివేదికకు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం రిలీజ్ చేశారు. కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ వార్షిక నివేదికను విడుదల చేయగా డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ క్రైమ్ నివేదిక వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం..

ఎన్నికల కేసులు కోకొల్లలు

ఇదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో వరంగల్ పోలీస్ అదికారులు ఎలక్షన్లను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో పెద్ద మొత్తంలో నగదును పట్టుకున్నారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 108 కేసులు నమోదు చేశారు. ఎన్నికల్లో ఉచిత వస్తువులకు సంబంధించి 26 కేసులు నమోదు చేశారు. బంగారు ఆభరణాల విషయంలో 9 కేసులు నమోదు చేశారు. వాటి బరువు 7.8 కిలోలు కాగా మొత్తం విలువ 3.73 కోట్లు కావడం గమనార్హం. ఇక ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్ పరిధిలో మొత్తంగా 378 కేసులు నమోదు చేసి, రూ.35.78 లక్షల విలువైన మద్యం సీసాలు సీజ్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో 7,863 మంది వ్యక్తులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు.

అంతర్రాష్ట్ర ముఠాల అరెస్ట్

ఈ ఏడాది వరంగల్ పోలీసులు 8 అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకున్నారు. మొత్తంగా 21 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.58.62 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణకు సంబంధించి 18 మందిపై పీడీ యాక్టులు కూడా పెట్టారు. కమిషనరేట్ లో ఈ సంవత్సరం 911 దొంగతనాలు జరిగాయి. కానీ అందులో 486 కేసులు మాత్రమే పోలీసులు ఛేదించారు. మొత్తంగా 10.84 కోట్ల వరకు చోరీ జరగగా అందులో 36 శాతం అంటే.. 3.6 కోట్ల వరకు మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగాయి. 2022లో 1,149 రోడ్డు ప్రమాదాల్లో 438 మంది చనిపోగా ఈ సంవత్సరం 1,526 ప్రమాదాల్లో 487 మంది ప్రాణాలు కోల్పోయారు.

మహిళలపై పెరిగిపోయిన దాడులు

కమిషనరేట్ లో గడిచిన ఏడాది కాలంలో మహిళలకు సంబంధించిన విషయాల్లో మొత్తంగా 1,705 కేసులు నమోదు అయ్యాయి. అందులో రేప్ కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తంగా 184 రేప్ కేసులు నమోదు కాగా.. గతేడాదితో పోలిస్తే 36.29 శాతం కేసులు ఎక్కువయ్యాయి. వీటితో పాటు కమిషనరేట్ లో మర్డర్లు కూడా పెరిగిపోయాయి. ఈ సారి 44 హత్యలు జరగగా.. గతం కంటే 7.31 శాతం కేసులు ఎక్కువ నమోదు కావడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీలపై 2.28 శాతం నేరాలు తగ్గిపోయాయి. 2022లో 176 ఎస్సీ, ఎస్టీ కేసులు ఫైల్ కాగా 2023లో 172 కేసులు నమోదు అయ్యాయి.

టాస్క్ ఫోర్స్ లో 114 కేసులు

వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ సంవత్సరం 114 కేసులు నమోదు చేసి, వివిధ కేసుల్లో 409 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 6.6 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గంజాయికి సంబంధించి 34 కేసుల్లో 93 మందిని అరెస్ట్ చేసి, 2.6 కోట్ల విలువైన సరకు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలకు సంబంధించి 22 కేసులు నమోదు చేసి, 89 మంది అరెస్ట్ చేశారు. 4.42 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బెల్లం రవాణాకు సంబంధించి 8 కేసులు ఫైల్ చేసి, 13 మందిని కటకటాల పాలుచేశారు.

ఈ సంవత్సరం బాల నేరస్తుల చట్టం కింద 16 కేసులు నమోదు చేసి, 219 మంది పిల్లలను రక్షించారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మహిళలు, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై 281 కేసులు నమోదు చేశారు. కాగా కమిషనరేట్ లో శాంతి భద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా వివరించారు.

రిపోర్టింగ్ : (హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం