Warangal News : ఎమ్మెల్సీల రాజీనామాలు, వరంగల్ లో మళ్లీ ఎన్నికలు
Warangal News : వరంగల్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు స్థానాల్లో ఆరు నెలల్లోగా ఎన్నికలు జరుగనున్నాయి.
Warangal News : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన కడియం శ్రీహరి తమ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిని ఆరు నెలల్లోగా భర్తీ చేయాల్సి ఉండటంతో తొందర్లోనే ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
పల్లా గెలవడంతో
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకోవాల్సిన ఆయన శనివారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేశారు. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కాస్త ఖాళీ అయ్యింది. 2021 మార్చి 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగగా... ఆ సమయంలో మొత్తంగా 76 మంది వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడగా.. ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న టఫ్ ఫైట్ ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు నడవగా... చివరకు పల్లా విజేతగా నిలిచారు. ఆయన ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగాల్సి ఉంది. కానీ తాజా ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి గెలవడంతో ఆయన రాజీనామా అనివార్యమైంది.
ఎమ్మెల్యే కోటా కూడా ఖాళీ
అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కడియం శ్రీహరి విజయం సాధించారు. 2015 లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా ఎన్నికై మంత్రిగా పని చేసిన ఆయన 2021 జూన్ వరకు ఎమ్మెల్సీ పదవిలో కొనసాగారు. ఆ తరువాత అప్పటి సీఎం కేసీఆర్ మళ్లీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే కోటాలోనే మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఈ మేరకు 2021 నవంబర్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2027 నవంబర్ వరకు కొనసాగాల్సి ఉంది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఎమ్మెల్యేగా ఎన్నికైన కడియం శ్రీహరి శనివారం ఎమ్మెల్సీ బాధ్యతలకు రాజీనామా చేశారు. ఈ మేరకు వారి రాజీనామాలను శాసనమండలి ఛైర్మన్ కూడా ఆమోదించారు. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి కూడా ఖాళీ అయ్యింది.
ఆరు నెలల్లోగా మళ్లీ ఎన్నికలు
ఎమ్మెల్సీలు పదవీకాలం ఆరేళ్లపాటు ఉంటుంది. కాగా ఓ వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇద్దరూ రాజీనామా చేయడంతో ఆ రెండు స్థానాలకు ఆరు నెలల్లోపు ఎలక్షన్ జరపాల్సి ఉంది. దీంతో తొందర్లోనే మళ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా.. ఇప్పుడు హస్తం పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవులకు ఆశావహులు పోటీ పడుతున్నారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)