తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Assembly Elections 2023 : మరోసారి తెరపైకి 'పొత్తు'... మునుగోడు బరిలో కామ్రేడ్లు..?

Telangana Assembly Elections 2023 : మరోసారి తెరపైకి 'పొత్తు'... మునుగోడు బరిలో కామ్రేడ్లు..?

20 August 2023, 5:42 IST

google News
    • TS Assembly Elections : ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి బీఆర్ఎస్ - కామ్రేడ్ల పొత్తు తెరపైకి వస్తోంది. ఆ దిశగా అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ సీటు ఖరారయ్యే అవకాశం ఉందనే చర్చ జిల్లా రాజకీయాల్లో గట్టిగా నడుస్తోంది. 
కమ్యూనిస్టు పార్టీల నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో)
కమ్యూనిస్టు పార్టీల నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో)

కమ్యూనిస్టు పార్టీల నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో)

Munugode Assembly Constituency: గతేడాది జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్ని కల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చాయి సీపీఐ, సీపీఎం పార్టీలు. ఆ పార్టీల మద్దతుతో బీఆర్ఎస్ విక్టరీ కొట్టింది.ఈ పొత్తు మునుగోడుకు మాత్రమే పరిమితం కాదని.. భవిష్యత్ లోనూ ఉంటుందని అప్పట్లోనే చెప్పుకొచ్చారు కేసీఆర్. ఓ రకంగా బీఆర్ఎస్ విజయంలో కామ్రేడ్లు కీలకంగా మారిన సంగతి కూడా తెలిసిందే. ఆ తర్వాత కూడా సందర్భాన్ని బట్టి ఆ పార్టీ అగ్రనేతలతో మంతనాలు జరుపుతూ వచ్చారు గులాబీ బాస్. కట్ చేస్తే ఆ తర్వాత కామ్రేడ్లతో పొత్తు విషయంపై కేసీఆర్ కాస్త సైలెన్స్ అయినట్లు కనిపించారు. అయితే ప్రస్తుతం ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న వేళ.... వ్యహాలకు పదునుపెట్టే పనిలో పడ్డారు గులాబీ దళపతి. ఇప్పటికే రేసు గుర్రాలపై కసరత్తు చేస్తుండగా... త్వరలోనే ఫస్ట్ లిస్ట్ ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే...కామ్రేడ్లతో మరోసారి మైత్రి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య మళ్లీ చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ సీటు విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

మునుగోడు బరిలో సీపీఐ...?

కామ్రేడ్లతో పొత్తు విషయంలో కేసీఆర్ సముఖంగా ఉన్నప్పటికీ... అసలు సమస్య అంతా సీట్లే అన్నట్లుగా మారింది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లపై కామ్రేడ్లు ఆశలు పెట్టుకోవటంతో... పొత్తుపై ఎటు తేల్చుకోలేని పరిస్థితి నెలకొన్నట్లు వార్తలు వినిపించాయి. దీంతో పొత్తు ఉంటుందా..? ఉండదా..? అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానున్న వేళ... మరోసారి కామ్రేడ్లతో చర్చలు జరుగుతున్నట్లు లీక్ లు వస్తున్నాయి. కామ్రేడ్ల ప్రతిపాదనల విషయంలో... గులాబీ పెద్దలు కూడా కొన్ని ఆప్షన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. సీట్లే కాకుండా... ఎమ్మెల్సీ పదవుల విషయాన్ని కూడా కామ్రేడ్ల వద్ద ప్రస్తావిస్తున్నారట..! అయితే... ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు సీటు విషయంలో సీపీఐకి లైన్ క్లియర్ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ దిశగా ఇరు పార్టీల పెద్దలు చర్చలు జరుపుతున్నారట...! గతేడాది జరిగిన బైపోల్ లో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు కామ్రేడ్లు. అయితే ఈసారి పొత్తు కుదిరితే ఈ సీటును సీపీఐకి ఇవ్వాలని గులాబీ బాస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ మద్దతుతో మునుగోడులో సీపీఐ అభ్యర్థి పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఆ పార్టీ తరపున యాదవ సామాజికవర్గానికి చెందిన నెల్లికంటి సత్యం రేసులో ఉన్నారు. మునుగోడులో బీసీలు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో.... బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వటం ద్వారా ఆయా వర్గాలకు కూడా బలమైన సందేశాన్ని పంపినట్లు అవుతుందని ఇరుపార్టీల నేతలు లెక్కలు వేస్తున్నారట..!

మొత్తంగా గతేడాది జరిగిన ఉపఎన్నికల వేళ మునుగోడు రాజకీయం రసవత్తరంగా కనిపించింది. ఈ నేపథ్యంలో... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరు ఉంటారన్న చర్చ గట్టిగా జరుగుతోంది. ఇదే సీటును మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ఆశిస్తుండగా.... కొత్తగా గుత్తా సుఖేందర్ రెడ్డి గుత్తా అమిత్ రెడ్డి వన్ ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. వీరే కాకుండా... స్థానికంగా ఉన్న నారబోయిన రవి ముదిరాజ్, కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న పల్లె రవికుమార్ గౌడ్, కర్నాటి విద్యాసాగర్ వంటి బీసీ నేతలు తమ పేర్లను పరిశీలించారని గులాబీ పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్నారట..! అయితే కామ్రేడ్లతో పొత్తు విషయంపై రాబోయే రోజుల్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ పొత్తు కుదిరితే మాత్రం... మునుగోడు సీటు దాదాపు సీపీఐకి వెళ్లే ఛాన్స్ స్పష్టంగా ఉంది. అలాకాకుండా... బీఆర్ఎస్ అభ్యర్థికే సీటు ఖరారు అయితే జిల్లాలోని ఏదైనా ఒక సీటు మాత్రం కామ్రేడ్లకు కేటాయించవచ్చు. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే…!

తదుపరి వ్యాసం