తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly Elections 2023 : మరోమారు ఆసక్తికరంగా 'మునుగోడు' రాజకీయం..! టికెట్ రేసులో ఉన్నదెవరు…?

TS Assembly Elections 2023 : మరోమారు ఆసక్తికరంగా 'మునుగోడు' రాజకీయం..! టికెట్ రేసులో ఉన్నదెవరు…?

07 August 2023, 14:20 IST

google News
    • Munugode Assembly Constituency Elections: తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది.  ప్రధాన పార్టీలు రేసు గుర్రాలపై దృష్టిపెట్టాయి. గతేడాది ఉపఎన్నికతో అందరి దృష్టిని ఆకర్షించింది మునుగోడు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారనేది మరోసారి ఆసక్తికరంగా మారింది.
మునుగోడు రాజకీయం
మునుగోడు రాజకీయం

మునుగోడు రాజకీయం

Telanagna Assembly Elections 2023 : మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు... వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే... ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిన పార్టీలన్నీ ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇక గతేడాది తెలంగాణ రాజకీయాలనే షేక్ చేసేలా మునుగోడు బైపోల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ్నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరు..? మునుగోడులో రాజకీయం ఎలా ఉండబోతుందన్న చర్చ ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తోంది. గతేడాది బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు కొత్తవారు కూడా ప్రయత్నాల్లో ఉండటంతో మునుగోడు రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతుందనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం మునుగోడు. బీసీ జనాభా ఎక్కువగా ఉండటమే కాదు...ప్రజా ఉద్యమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నియోజకవర్గం ఏర్పడిన రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉండగా... ఆ తర్వాత కమ్యూనిస్టుల కంచుకోటగా మారిపోయింది. కానీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రభావం, వర్తమాన రాజకీయల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులతో ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం తగ్గిపోయింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గులాబీ జెండా ఎగిరింది. ఆ తర్వాత జరిగిన ముందస్తు ఎన్నికల్లో హస్తం పార్టీ వికర్టీ కొట్టింది. అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి... బీజేపీలో చేరటం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో గతేడాది ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో భాగంగా కామ్రేడ్లతో పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్... 10 వేల మెజార్టీతో విజయం సాధించింది. ఇక మరికొద్ది నెలల్లోనే మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ప్రధాన పార్టీల నుంచి పాత అభ్యర్థులే బరిలో ఉంటారా లేక మారుతారా అన్న చర్చ నియోజకవర్గంలో జోరందుకుంది.

అభ్యర్థులు మారుతారా..? లేక వారేనా..?

గతేడాది జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతి బరిలో నిలవగా... బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిలబడ్డారు. ఇక బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 10 వేల ఓట్లకు పై మెజార్టీతో గెలవగా... బీజేపీ రెండో స్థానంలో నిలించింది. ఇక కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన స్రవంతికి కేవలం 23వేల ఓట్లు వచ్చాయి. డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఇక భారీ అంచనాలతో దిగిన బీఎస్పీకి కేవలం 4 ఓట్లు రాగా... ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు 805 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు మారే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి చల్లమల్ల కృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో అన్నీతానై నడిపిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడి ఆశీస్సులు కూడా ఆయనకు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దాదాపు ఆయనే బరిలో ఉంటారని తెలుస్తోంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీపై అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీలోనే కొనసాగుతుండగా.. మళ్లీ ఇక్కడ్నుంచే పోటీ చేస్తారా లేదా అనే దానిపై క్లారిటీ రావటం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ అలా జరగకపోతే... బీజేపీ అభ్యర్థిగా మునుగోడులో మళ్లీ ఆయనే పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన బరిలో ఉండకపోతే... పార్టీ సీనియర్ నేత మనోహర్ రెడ్డి ఉండే ఛాన్స్ ఉంది.

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విషయానికొస్తే అత్యంత ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూసుకుంట్లకు టికెట్ దక్కే అవకాశాలు చాలా తక్కువ అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా నడుస్తోంది. గత ఉపఎన్నికల టైంలోనే ఆయన అభ్యర్థితత్వాన్ని సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకించారు. హైకమాండ్ పెద్దల ఎంట్రీతో అసమ్మతి నేతలతో చర్చలు జరిపి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఉపఎన్నిక కోసం పార్టీ అంతా కష్టపడినప్పటికీ... ఆయనకు కేవలం 10 వేల మెజార్టీనే వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి టికెట్ ఇస్తారా లేదా అనేది అనుమానంగా మారింది. ఇదే సీటుపై పార్టీ సీనియర్ నేత కర్నె ప్రభాకర్ కన్నేశారు. ఆయనే కాకుండా... నారబోయిన రవి కూడా సీటును గట్టిగా ఆశిస్తున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ లో చేరి కార్పొరేషన్ ఛైర్మన్ గా అవకాశం దక్కించుకున్న జర్నలిస్ట్ నేత పల్లె రవి కుమార్ గౌడ్ కూడా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారుగా ప్రయత్నాల్లో ఉంటే... కొద్దిరోజులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. సామాజిక, సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతూ... గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో పడ్డారు. పార్టీ టికెట్ దక్కించుకొని మునుగోడు లేదా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి బరిలో ఉండాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపు అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇక బీఎస్పీ నుంచి మరోసారి శంకరాచారినే ఉండే అవకాశం ఉంది.

మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.... మరోమారు మునుగోడు పాలిటిక్స్ రసవత్తరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రేసులో ఉండే అభ్యర్థులు ఎవరనే దానిపై రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

తదుపరి వ్యాసం