Telangana Congress: బాసర టూ ఖమ్మం..! పాదయాత్రకు మరో హస్తం నేత రెడీ?
19 February 2023, 6:52 IST
- Telangana Assembly Elections 2023: తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో... ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇక పలువురు ముఖ్య నేతలు పాదయాత్రలతో బిజీబిజీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే... మరో కాంగ్రెస్ సీనియర్ నేత కూడా పాదయాత్రకు రెడీ అయిపోతున్నారట..!
కాంగ్రెస్ నేత భట్టి పాదయాత్ర!
Telangana Pradesh Congress : త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వ్యూహాలకు ప్రతివ్యూహాలు.. కౌంటర్లకు రీకౌంటర్లు... విమర్శలకు ప్రతివిమర్శలు... అటు నుంచి సౌండ్... ఇటు నుంచి రీసౌండ్... సెటైర్లు.. సీరియస్ కామెంట్స్…ఇలా ఒక్కటి కాదు ఎన్నెన్నో సిత్రాలు చూసే టైం రాబోతుంది. ఇక ఇప్పట్నుంచే కార్యాచరణతో పాటు ఎన్నికలను ఎదుర్కొనే విషయంపై ప్రధాన పార్టీలు కసరత్తు చేసే పనిలో పడ్డాయి. ఎలాగైనా హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని బీఆర్ఎస్ చూస్తుంటే... మిషన్ 90 అంటూ కమలనాథులు కార్యాచరణం సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పుడిప్పుడే లైన్ లోకి వస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కూడా దూకుడు పెంచేసింది. దీంతో తెలంగాణ రాజకీయం..రసవత్తరంగా మారుతోంది.
వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావోరేవోగా మారాయి. ఇప్పటికే పలు బై పోల్స్ లో ఢీలా పడిపోయిన హస్తం పార్టీ... ఈసారి ఎలాగైనా తెలంగాణను చేజిక్కించుకోవాలని చూస్తోంది. బీజేపీకి తెలంగాణలో సీన్ లేదని... బీఆర్ఎస్ ను కొట్టే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందంటూ గట్టిగా చెబుతూ ప్రజల్లోకి వెళ్తోంది. మొన్నటి వరకు అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ పార్టీ... ఇప్పుడిప్పుడే లైన్ లోకి వస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. మేడారం నుంచి మొదలుపెట్టిన ఆయన... పలు నియోజకవర్గాల్లో పూర్తి చేశారు. ఇదిలా ఉంటే.... హస్తం పార్టీకి సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుండగా... భట్టి కూడా ఇదే పేరుతో పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. మార్చి తొలివారంలోనే ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారని... ఇందుకు బాసరను వేదిక చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం 35 నియోజకవర్గాల మీదుగా యాత్ర చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే గాంధీభవన్ వేదికగా ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేశారని సమాచారం. దాదాపు 8 నుంచి 9 జిల్లాల మీదుగా పాదయాత్ర చేసి... ఖమ్మంలో ముగింపు సభను తలపెట్టేందుకు ప్లాన్ రెడ్డీ చేశారని తెలుస్తోంది.
కారణం ఇదేనా....
జోడో యాత్ర స్ఫూర్తిగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో హాథ్‌సే హాథ్ జోడో యాత్రలను పూర్తి చేయాలని హస్తం అధినాయకత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ములుగు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే రెండు నెలల కాలంలో మొత్తం 119 నియోజకవర్గాలను కవర్ చేయాలంటే ఇబ్బంది అవుతందన్న కారణంతోనే... భట్టి కూడా రంగంలోకి దిగుతున్నట్లు పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది. ఓ వైపు రేవంత్, మరోవైపు భట్టి ఆధ్వర్యంలో యాత్రలు చేయడం ద్వారా త్వరగా హాత్ సే హాథ్ జోడో ముగించవచ్చన్నదే అన్న యోచలో పార్టీ ఉన్నట్లు సమాచారం. హైకమాండ్ ఆదేశాలతో నేతల మధ్య సమన్వయంతోనే పాదయాత్రకు శ్రీకారం చుడుతారని పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది.
మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న కసితో నేతలు ముందుకెళ్తున్నారు. వీరిద్దరి పాదయాత్రే కాదు... త్వరలోనే అదే పార్టీకి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... కూడా బైక్ యాత్ర చేపట్టబోతున్నారు. ఆయన కూడా ప్రకటన చేశారు. మొత్తంగా టీ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిగా ప్రజాక్షేత్రంలోకి వస్తున్న వేళ... కేడర్ లో కొత్త జోష్ మొదలైంది.