తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Assembly : అసెంబ్లీలో హరీశ్ వర్సెస్ సీఎం రేవంత్ - బడ్జెట్ పై వాడీవేడీగా చర్చ

Telangana Assembly : అసెంబ్లీలో హరీశ్ వర్సెస్ సీఎం రేవంత్ - బడ్జెట్ పై వాడీవేడీగా చర్చ

27 July 2024, 12:08 IST

google News
    • Telangana Assembly Session Updates : తెలంగాణ బడ్జెట్ పై శనివారం చర్చ జరిగింది. బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడారు. ఆయన చేసిన పలు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 2024
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 2024

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 2024

Telangana Assembly Session Updates : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. శనివారం ప్రశ్నోత్తరాలు కాకుండా… నేరుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ జరిగింది. బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా… పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

బడ్జెట్ లో రైతు భరోసాతో పాటు పెన్షన్ల పెంపు వంటి అంశాల ప్రస్తావన లేదన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా ఉందన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ స్కీమ్ లను కొనసాగించాలన్నారు. అవసరమైన ప్రభుత్వం పేరు మార్చి అయినా సరే అమలు చేయాలని కోరారు. దాదాపు గంటకు పైగా హరీశ్ రావు మాట్లాడారు. బీసీలతో పాటు అన్నివర్గాల బడ్జెట్ కు కోత పెట్టారని అన్నారు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు అదుపుతాయని… ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.

హరీశ్ రావు మాట్లాడే సమయంలో పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పలువురు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతూ… హరీశ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

సీఎం రేవంత్ కౌంటర్…

హరీశ్ రావు ప్రసగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… అబద్ధాలతో హరీష్ రావు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారని అన్నారు. ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే వారు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పారు. ప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదు.. అదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ.7వేల కోట్లకే తెగనమ్మారు. గొర్రెల స్కీం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారు. గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. ఆడబిడ్డల సెంటిమెంట్ నూ దోపిడీకి ఉపయోగించుకున్నారు. కురుమ, యాదవుల సోదరులను అమాయకులను చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. కాళేశ్వరం ఖర్చు విషయంలోనూ గతంలో ఒకటి చెప్పి...ఇప్పుడు రూ.94వేల కోట్లు అని చెబుతున్నారు. మీరు ఎన్ని వేల కోట్ల విలువైన భూములు అమ్మిర్రో లెక్క తీద్దాం” అని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

హరీశ్ రావు కేవలం అప్పుల లెక్కలు చెబుతున్నారు... కానీ అమ్ముకున్న లెక్కలు చెప్పడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పదేళ్లయినా పాలమూరుకు చేసిందేం లేదని దుయ్యబట్టారు. 20 లక్షల కోట్లకు పైగా ఖర్చుపెట్టినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం వీళ్లు కాదా? అని ప్రశ్నించారు.

“రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా... రంగారెడ్డి జిల్లాపై నిర్లక్ష్యం వహించారు. రంగారెడ్డి జిల్లా ఆస్తులు అమ్ముకున్నారు కానీ జిల్లాకు సాగు నీరు ఇవ్వలేదు. ప్రజలు బీఆరెస్ కు గుండుసున్నా ఇచ్చినా బుద్ధి మారకుండా ఇలా మాట్లాడటం సరైంది కాదు. మీరు నిజాయితీ పాలన అందించి ఉంటే... బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్, గొర్రెల పంపిణీ పై విచారణకు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలి” అని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు.

తదుపరి వ్యాసం