TG Young India Schools : నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
11 October 2024, 17:18 IST
- TG Young India Schools : తెలంగాణలో పలుచోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శంకుస్థాపనలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి
షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కోందుర్గులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేశారు. 28 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లకు భూమి పూజ జరిగిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. 25 ఎకరాల విస్తీర్ణంలో స్కూల్ నిర్మాణం జరగబోతోందని వివరించారు. ప్రత్యేకంగా స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. మొత్తం రూ.5 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
'బీఆర్‌ఎస్ 5 వేల పాఠశాలలను మూసివేసింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. తెలంగాణ విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నాం. బదిలీలు, ప్రమోషన్ల విషయంలో చిన్న వివాదం కూడా రాకుండా పరిష్కరిస్తున్నాం. 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం. 34 వేల మంది టీచర్లను బదిలీ చేశాం' అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నల్గొండ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఎస్ఎస్బీసీ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి సాగునీరు అందించడమే నా లక్ష్యం. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి హామీలన్నీ గాలికి వదిలేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ డిపాజిట్ కోల్పోయింది. రూ.7 లక్షల కోట్లు తిన్న బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్తారు' అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.
'మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా విద్యా విధానాన్ని రూపొందించాం. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం సాధ్యం కాదనే విమర్శలు వచ్చాయి. చిత్తశుద్ధితో పనిచేశాం. ఆచరణ సాధ్యమని నిరూపిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి స్కూల్స్ పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది కొత్త స్కూల్స్‌లోనే విద్యాభోదన జరుగుతుంది. అన్ని వర్గాలవారికి నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లా పొన్నెకల్‌లో మంత్రి పొంగులేటి పర్యటించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. 'కులమతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వం విద్యాశాఖను పట్టించుకోలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం అమ్మ ఆదర్శ పథకం పేరుతో రూ.657 కోట్లు కేటాయించాం. డీఎస్సీ ద్వారా 10,600 పోస్టుల భర్తీ చేశాం' అని పొంగులేటి వివరించారు.