Musi River Rejuvenation : మూసీ నది పునరుజ్జీవానికి ‘థేమ్స్’ ప్రణాళిక
20 January 2024, 7:54 IST
- Hyderabad Musi River Rejuvenation : మూసీ పునరుజ్జీవానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా లండన్ టూర్ లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి… థేమ్స్ నది పాలక మండలి అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపారు.
థేమ్స్ రివర్ పాలక మండలితో సీఎం రేవంత్ చర్చలు
Hyderabad Musi River Rejuvenation : మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తెలుసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటించారు. లండన్ లోని థేమ్స్ నదిని సందర్శించారు. థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
థేమ్స్ ప్లాన్ పై చర్చలు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అక్కడి థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, ఫోర్డ్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ కెహల్ లివీ సీఎంకు వివరించారు. అందులో భాగంగా ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, భాగస్వామ్యమైన సంస్థలు, అందంగా తీర్చిదిద్దేందుకు అనుసరించిన అత్యుత్తమ విధానాలన్నీ ఈ సందర్భంగా చర్చించారు.
‘నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయి. హైదరాబాద్ సిటీకి అటువంటి ప్రత్యేకత ఉంది. అటు మూసీ నది వెంబడి, ఇటు హుస్సేన్ సాగర్ చుట్టూ, ఉస్మాన్ సాగర్ లాంటి నదీ వ్యవస్థ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా తిరిగి మూసీకి పునర్వైభవం తీసుకు వస్తే నదులు, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుంది...‘ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. తన విజన్ 2050 కు అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి లండన్ అధికారులు సానుకూలతతో చర్చలు జరిపారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిచ్చినట్లు అక్కడి అధికారులు వివరించారు. నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం, ఎంచుకున్న ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే రెవిన్యూ మోడల్ ను ఎంచుకోవాలని చెప్పారు.
ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే కొత్త విధానాలు ఎప్పటికప్పుడు గమనించటంతో పాటు, ప్రాజెక్టు నిర్వహణపై నిరంతరం దృష్టి పెట్టాలన్నారు. హైదరాబాద్ లో మూసీ నదిని పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చింది. ఇదే సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ లైన్, వివిధ సంస్థల భాగస్వామ్యంపైనా చర్చించారు. ఈ ప్రాజెక్టుకు నిర్దిష్టమైన సహకారం అందించేందుకు భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపాలని ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, సీఎం స్పెషల్ సెక్రెటరీ బి.అజిత్ రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రాపాలీ, ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ ప్రమోషన్స్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి, మూసీ రివర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎస్ఈ వెంకట రమణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.