CM Revanth Davos Tour : ముగిసిన సీఎం రేవంత్ టీమ్ దావోస్ టూర్ - 200 సంస్థలతో సంప్రదింపులు, రూ.40,232 కోట్ల పెట్టబడులు
CM Revanth Davos Tour Updates: సీఎం రేవంత్ దావోస్ టూర్ ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా… మొత్తం 200 సంస్థలతో సంప్రదింపులు జరిపారు. పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
CM Revanth Davos Tour Updates: ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ముగిసింది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు. అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.
దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ ఫోరమ్ లలో మాట్లాడారు. చిన్న మరియు సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు. మరో సదస్సులో మాట్లాడుతూ…. హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ ను సాఫ్ట్ వేర్ తో సమ్మిళితం చేయాలన్నారు. ఖరీదైన హెల్త్ కేర్ సేవల ఖర్చులను తగ్గించేందుకు అమెరికా, యూరప్ దేశాలు పని చేస్తున్నాయని అన్నారు. హెల్త్ కేర్ సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు, అధునాతన వైద్య సేవలను ప్రతి మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరుకోడానికి డిజిటల్, సాంకేతికను ఉపయోగించాలని సీఎం అన్నారు.
ముఖ్యమంత్రితో సమావేశమైన భారతీయ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లందరూ తెలంగాణలో కొత్త ప్రభుత్వం అనుసరించిన వ్యాపారం, స్నేహ దృక్పథానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. దావోస్‌కు రావడం.. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవటం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు, వృద్ధి కలిసి రావాలి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం మా ప్రయత్నం కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్ కు రావాలి...‘ అని స్వాగతం పలికారు.
లండన్ లో ఎంపీలతో సమావేశం
దావోస్ టూర్ తర్వాత లండన్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి… భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లతో సమావేశమయ్యారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో గురువారం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘భారత్, బ్రిటన్ మధ్య బలమైన బంధం ప్రజాస్వామ్యమే. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే అత్యవసరం...’అన్నారు. యునెస్కో 1016 సంవత్సరంలోనే లండన్ లోని వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ చారిత్రక భవనంలోనే ఈ సమావేశం జరిగింది. లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మతో పాటు మరో ఏడుగురు ఎంపీలు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.
“నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. హింస, ఉగ్రవాదం, ప్రజల హక్కుల హరణ, ప్రజాస్వామ్యంపై దాడి... వీటన్నింటికీ విరుగుడు ప్రజాస్వామ్యం పటిష్టం చేయటం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలను శక్తిమంతులను చేయటమే అసలైన పరిష్కారం.‘ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ‘ఒకప్పుడు మీ దేశం మా దేశాన్ని పరిపాలించింది. మా కాంగ్రెస్ పార్టీనే మీకు వ్యతిరేకంగా పోరాడింది. అప్పుడు మహాత్మ గాంధీ ఎంచుకున్న సత్యం, అహింస, న్యాయ పోరాటమే మీ దేశానికైనా మా దేశానికైనా ఇప్పటికీ మార్గదర్శకం..‘ అన్నారు.
ఇదే సందర్భంగా తన స్వీయ అనుభవాలను సీఎం వారితో పంచుకున్నారు. ‘నాది గ్రామీణ ప్రాంతం. నేను సామాన్య రైతు బిడ్డను. కేవలం ప్రజాస్వామ్యం వల్లనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, పార్టీ ఎంచుకున్న ప్రజాస్వామ్య భావనతోనే నాకు ఇంతటి అవకాశం వచ్చింది. దేశంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందే అవకాశాలు అసలైన ప్రజాస్వామ్యం ద్వారానే సాధ్యమవుతాయి..‘ అని చెప్పారు.