Hyderabad News : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం
Hyderabad News : రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో అంబర్ పేట్ పోలీస్ హెచ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మృతి చెందారు. స్థానికత కారణంగా అతని భార్యకు ఉద్యోగం రాలేదు. సీఎం ఆదేశాలతో ఆమెకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం దక్కింది.
Hyderabad News : హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అంబర్ పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ సొంగా శేఖర్ విధులు నిర్వర్తిస్తూ.....రెండేళ్ల కిందట సెప్టెంబర్ 30, 2021న రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ శేఖర్ మరణించాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు. కాగా శేఖర్ భార్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది కావడంతో అప్పటి ప్రభుత్వం స్థానికత కారణం చూపుతూ రెండు సంవత్సరాలుగా ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది.

కానిస్టేబుల్ భార్యకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం
ఇటీవల తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు కలిసి తమ దీనస్థితిని తెలిపారు. దీంతో సత్వరమే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి....కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డీజీపీ, రాచకొండ కమిషనర్లను ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డీజీపీ రవి గుప్త, రాచకొండ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా రాచకొండ సీపీకి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం, డీజీపీ ఆదేశానుసారం సీపీ సుధీర్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ ఆమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలో సమర్థవంతంగా నీతి నిజాయితీతో పని చేయాలని భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని కమిషనర్ సుధీర్ బాబు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు సీఎం, డీజీపీ, సీపీకి కృతజ్ఞతలు తెలియచేశారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా