CM KCR Kondagattu Tour: కొండగట్టులో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
15 February 2023, 14:51 IST
- CM KCR Kondagattu Tour Updates:కొండగట్టులో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కొండగట్టులో సీఎం కేసీఆర్
CM KCR Visits Kondagattu Tour: సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తున్నారు. అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాలను విహంగ వీక్షణం ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం అర్చకులు సీఎంను పూర్ణకుంభంతో ఆలయంలోని ఆహ్వానించారు. తొలుత ఆలయం వద్దకు కేసీఆర్ చేరుకోగానే మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఆయనకు స్వాగతం పలికారు.
జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు చేశారు. ఈ సమావేశం తర్వాత కేసీఆర్… హైదరాబాద్ కు బయల్దేరారు.
యాదాద్రిని దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేసిన రాష్ట్ర ప్రభుత్వం... జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. యాదాద్రి తరహాలోనే .. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించిన సర్కార్... ఈ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే రూ. 100 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో... పనులు ప్రారంభించేందుకు సమాయత్తం అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి... చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, యాదాద్రి ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి... ఆదివారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. దేవలయాన్ని పరిశీలించిన ఆయన... జిల్లా కలెక్టర్, ఆలయ పూజారులతో చర్చలు జరిపారు.
400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండగట్టు ఆంజనేస్వామి ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే... వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఇక్కడ వసతులు లేవు. ఈ నేపథ్యంలో.. మాస్టర్ ప్లాన్ లో చేర్చాల్సిన అభివృద్ధి పనులపై ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రధాన ఆలయం, రథి విమాన గోపురం, రెండవ ప్రాకారం, నాలుగు వైపులా రాజగోపురాలు, యాగశాల, నివేదన శాల, అభిషేక మండపం, సత్యన్నారాయణ స్వామి మండపం, ధర్మ దర్శనం.. ప్రత్యేక దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు తదితర పనులపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఘాట్ రోడ్డు, మెట్ల మార్గం, గెస్ట్ హౌస్ తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. గతంలో దేవాలయం ఆధ్వర్యంలో కేవలం 45 ఎకరాలు మాత్రమే ఉండగా... 4 ఏళ్ల క్రితం జిల్లా కలెక్టర్ మరో 333 ఎకరాలను ఆలయ కమిటీకి అప్పగించారు. దీంతో... కొండగట్టు అంజన్న ఆలయ అథారిటీ పరిధిలో ప్రస్తుతం 378 ఎకరాలు ఉన్నాయి.