Kondagattu : దివ్య క్షేత్రంగా కొండగట్టు.. దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్-cm kcr to visit kondagattu anjaneya swamy temple on february 15 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kondagattu : దివ్య క్షేత్రంగా కొండగట్టు.. దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్

Kondagattu : దివ్య క్షేత్రంగా కొండగట్టు.. దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్

HT Telugu Desk HT Telugu
Feb 14, 2023 07:24 PM IST

Kondagattu : ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 15న (బుధవారం) కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్నారు. ముందుగా అంజన్నను దర్శించుకోనున్న సీఎం.. ఆ తర్వాత ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. క్షేత్రాన్ని మొత్తం పరిశీలించనున్నారు.

కొండగట్టు పర్యటనకు సీఎం కేసీఆర్
కొండగట్టు పర్యటనకు సీఎం కేసీఆర్

Kondagattu : యాదాద్రి తరహాలో జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని.. దివ్య పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ. 100 కోట్లు మంజూరు చేసిన సర్కార్.. డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ పై కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి.. అభివృద్ధి పనులపై అధికారులు, ఆలయ నిర్వాహకులకి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా పర్యటన ఖరారైంది.

బుధవారం (ఫిబ్రవరి 15న) కొండగట్టును సందర్శించున్న సీఎం.. క్షేత్రస్థాయిలో ఆలయాన్ని పరిశీలించనున్నారు. కోనేరు పుష్కరిణి, కొండల రాయుని గుట్ట, సీతమ్మ వారి కన్నీటి ధార, బేతాళ స్వామి ఆలయంతో పాటు అక్కడి పలు ప్రాంతాలను పరిశీలించి... అభివృద్ధి పనులపై సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ముందుగా అనుకున్న మేరకు ఫిబ్రవరి 14న క్షేత్రాన్ని సందర్శించాల్సి ఉంది. అయితే... మంగళవారం రోజున భక్తుల సందడి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున.. ఆలయానికి వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో... మరుసటి రోజుకి పర్యటన షెడ్యూల్ ని మార్చారు.

ఈ మేరకు.. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సీఎం పర్యటన షెడ్యూల్ ను విడుదల చేశారు. ఫిబ్రవరి 15న ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానశ్రయం చేరుకొని.. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కొండగట్టు దేవస్థానానికి చేరుకోనున్నారు. ఉదయం 9.40 నిమిషాలకు ఆలయానికి రానున్న ఆయన... ముందుగా అంజన్నను దర్శించుకుంటారు. అనంతరం... అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ... టెంపుల్ అభివృద్ధిపై సమీక్షిస్తారు. ఇప్పటికే అధికారులు సమర్పించిన ప్రతిపాదనలు, ఆలయానికి అందుబాటులో ఉన్న స్థలం, చేపట్టాల్సిన నిర్మాణాలు, కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై చర్చిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కొండగట్టు నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు యాదాద్రి ఆర్కిటెక్ట్ ఆనందసాయి ఇప్పటికే రెండుసార్లు కొండగట్టు క్షేత్రాన్ని పరిశీలించారు. అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత.. ఆయన ఒక నమూనాను రూపొందించినట్లు సమాచారం. సీఎం పర్యటన సందర్భంగా.. క్షేత్రస్థాయిలో నమూనాను సీఎంకు వివరించనున్నారు. కేసీఆర్ సూచనలు, సలహాల మేరకు మార్పులు, చేర్పులు చేయనున్నారు. యాదగిరిగుట్టపై 3 ఎకరాల స్థలమే అందుబాటులో ఉండగా, కొండగట్టుపై 12 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. దీంతో ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాస్తు ప్రకారం గుట్టపైకి ఈశాన్యం వైపు నుంచి రోడ్డును నిర్మించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ కొత్త మార్గాన్ని నిర్మించడం వీలుకాకపోతే ప్రస్తుతం ఉన్న ఘాట్‌ రోడ్డును ఈశాన్యం వైపునకు మళ్లించాలని చూస్తున్నట్టు సమాచారం. అలాగే.... గుట్టపై 125 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు సమాచారం. స్వామివారి ఆలయ విస్తరణ, అనుబంధ నిర్మాణాలన్నీ కృష్ణ శిలతో చేపట్టనున్నారని తెలుస్తోంది.

Whats_app_banner