Dhanvantari: ధన్వంతరి ఎవరు? ధన్వంతరిని పూజించడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?-who is dhanwantari what are the results of worshiping dhanvantari ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dhanvantari: ధన్వంతరి ఎవరు? ధన్వంతరిని పూజించడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

Dhanvantari: ధన్వంతరి ఎవరు? ధన్వంతరిని పూజించడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

HT Telugu Desk HT Telugu
Dec 01, 2024 11:17 AM IST

Dhanvantari: హిందూ పురాణాల్లో ప్రఖ్యాతి కలిగిన దైవం ధన్వంతరి.ఆయుర్వేద శాస్త్రానికి మూలపురుషుడు, వైద్య దేవుడు ధన్వంతరి అని ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. గ్రామసీమల్లో ఆయుర్వేద వైద్యం చేసేవారిని ధన్వంతరిగానే పరిగణిస్తారని ఆయన అన్నారు.

ఆయుర్వేదం
ఆయుర్వేదం

హిందూ పురాణాల్లో ప్రఖ్యాతి కలిగిన దైవం ధన్వంతరి.ఆయుర్వేద శాస్త్రానికి మూలపురుషుడు, వైద్య దేవుడు ధన్వంతరి అని ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. గ్రామసీమల్లో ఆయుర్వేద వైద్యం చేసేవారిని ధన్వంతరిగానే పరిగణిస్తారని ఆయన అన్నారు. ధన్వంతరి ఎవరు? హిందూ పురాణాల ప్రకారం ధన్వంతరిని పూజిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి వంటి మరిన్న విషయాలు తెలుసుకుందాం.

ధన్వంతరి ఎవరు?

పురాణాల ప్రకారం ధన్వంతరి విష్ణుమూర్తి అవతారమని, వైద్యఆరోగ్య శాస్త్రాలకు మూలపురుషుడు అని ఆయుర్వేద శాస్త్రానికి మూల పురుషుడు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. క్షీరసాగర మధన సమయంలో ధనత్రయోదశినాడు చేతిలో అమృత కుండతో లక్ష్మీదేవి అనంతరం ధన్వంతరి అమృతభాండంతో వెలికివచ్చాడని తెలిపారు. ఆ వివరాలు మహాభాగవతంలో ప్రస్ఫుటంగా ఉన్నాయని ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మనకు ప్రధానంగా నలుగురు ధన్వంతరిలు కనిపిస్తారని, వారిలో ఇద్దరి గురించి భాగవతంలోనే ఉందని ఆయన అన్నారు.

మొదటి ధన్వంతరి క్షీరసాగర మధనవేళ అమృతంతో వచ్చిన స్వామి అన్నారు. ఆయనను హరి అవతారంగా భావిస్తారన్నారు. అందుకే ‘వైద్యో నారాయణో హరిః’ అనే నానుడి వచ్చిందన్నారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యభగవానుని వద్ద 16మంది ఆయుర్వేదం నేర్చుకున్నారని, వారిలో ధన్వంతరి ఒకడని వివరించారు. కాశీరాజు దివోదాసుకు ధన్వంతరి అనే బిరుదు ఉందని, ఆయనను కూడా ధన్వంతరి అని అన్నారు. ఈయన శుశ్రుతునకు ఆయుర్వేదం, శస్త్రచికిత్స నేర్పాడని చక్రవర్తిశర్మ వివరించారు. విక్రమాదిత్యుని ఆస్థానంలో గల ‘నవరత్నాలు’లో ధన్వంతరి పేరుగల మహాపండితుడు ఉన్నాడని, ఆయన తనపేరు మీదుగా ‘ధన్వంతరి నిఘంటువు’ అనే వైద్య పరిభాషా నిఘంటువును రచించారని చిలకమర్తి తెలిపారు.

ధన్వంతరి అంటే..‘‘ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి ధన్వన్తరిః’ అని వ్యుత్పత్తిగా మన పెద్దలు చెప్పారన్నారు. అంటే మనస్సు, శరీరానికి బాధకలిగించే శల్యములు అనగా రోగాలు, దోషాలు, దెబ్బలు, కురుపులు మొదలైన వాటిని నివారించేవాడు అని అర్థమన్నారు. భాగవతం ప్రకారం పురూరవ వంశంలో కాశీరాజు ధన్వంతరి ఒకరని ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. హరి అంశతో జన్మించిన ధన్వంతరి ఆయుర్వేద ప్రవక్తకుడు అయ్యాడన్నారు. అతని మనుమడు దివోదాస ధన్వంతరి ఆయుర్వేదాన్ని ఎనిమిది భాగాలుగా విభజించి విస్తరించాడని తెలిపారు. ఈయన క్రీ.పూ. 3000 సంవత్సరం నాటివాడని చిలకమర్తి అన్నారు.

ధన్వంతరీ ఆలయాలు వాటి ప్రత్యేకతలు:

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధన్వంతరి ఆలయాలు మనకు దర్శనమిస్తున్నాయన్నారు. వారణాసిలోని సంస్కృత విశ్వవిద్యాలయం మ్యూజియంలో, ఢిల్లీలోని ఆయుర్వేద సిద్ధ పరిశోధన మండలి కేంద్రంలో ధన్వంతరి విగ్రహాలు ఉన్నది. అలాగే తెలుగు నేలపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు సమీపంలోని చింతలూరులో ధన్వంతరి ఆలయం ఉందని ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. తమిళనాడులోని శ్రీరంగంలోగల రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలోగల ధన్వంతరి ఆలయంలో నిత్యపూజలు జరుగుతున్నాయన్నారు. 12వ శతాబ్దంలో నాటి ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు రంగనాథ భట్టర్‌ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అక్కడి శాసనం ద్వారా తెలుస్తోందన్నారు. ఇక్కడ తీర్థంగా కొన్ని మూలికల కషాయాన్ని ఇస్తారని చిలకమర్తి వివరించారు. కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురవాయూర్‌, త్రిసూర్‌ పట్టణాల మధ్య ‘నెల్లువాయ’ అనే గ్రామంలో ధన్వంతరి ఆలయం ఉందన్నారు. చికిత్సావృత్తి ప్రారంభించడానికి ముందు ఆయుర్వేద వైద్యులు అక్కడకు వచ్చి స్వామిని దర్శించుకుంటారన్నారు.

కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులోని యశ్వంతపురలోని గాయత్రి దేవస్థానంలో ధన్వంతరి ఆలయం ఉందని ఆయన తెలిపారు. ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి ఆవిర్భావ దినమైన ధనత్రయోదశినాడు ‘ధన్వంతరి వ్రతం’ చేస్తారన్నారు. అలాగే ‘ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ వజ్రజలౌక హస్తాయ సర్వామయవినాశనాయ త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమః’’ అనే ధన్వంతరి మంత్రం బహుళ వ్యాప్తిలో ఉందని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner