Food: తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను ఇచ్చే ఫుడ్ ఇది.. నిర్లక్ష్యం చేయకుండా ప్రతీ రోజూ తినండి!
Affordable Nutritious Food: తక్కువ ధరే అయినా కొన్ని ఆహారాల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంటాయి. ఇళ్లలో ఇలాంటివి ఉన్నా చాలా మంది పెద్దగా పట్టించుకోరు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు కలిగించే ఓ పుడ్ గురించి ఇక్కడ చూడండి.
పోషకాలు ఉండే ఆహారం అంటే ఎక్కువ ధరతో ఉండేవే అని చాలా మంది అపోహ పడతారు. తక్కువ రేటుతో ఉండే వాటిలో పోషకాలు అంతలా ఉండవని భావిస్తారు. అయితే, ఇది సరైన ఆలోచన కాదు. తక్కువ ధరతో నిత్యం ఇంట్లో ఉండే కొన్ని ఫుడ్స్ శరీరానికి ఎన్నో పోషకాలను అందించి, మేలు చేస్తాయి. అలాంటివే ‘వేరుశనగలు’. ఇవి దాదాపు అందరి ఇళ్లలో ఉంటాయి. కానీ చాలా మంది వీటిపై దృష్టి పెట్టరు. శ్రద్ధ పెట్టి ఎక్కువగా తినరు. పోషకాలు మెండుగా ఉండే వేరుశనగలు ప్రతీ రోజూ తింటే చాలా లాభాలు కలుగుతాయి.
బాదం, జీడిపప్పు లాంటి నట్స్‌తో పోలిస్తే వేరుశనగలు తక్కువ ధరకే లభిస్తాయి. కానీ పోషక విలువలు మెండుగా ఉంటాయి. అందుకే తక్కువ ఖర్చుతోనే వేరుశనగల నుంచి ఎక్కువ ప్రయోజనాలను పొందొచ్చు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
వేరుశనగలో పోషకాలు
వేరుశనగల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల వేరుశనగల్లో 25.8 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ ఈ, విటమిన్ బీ6, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, బయోటిన్, కాపర్, పాస్ఫరస్ లాంటి పోషకాలు వీటిలో ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే మోనో, పాలీ అన్‍సాచురేటెడ్ ఫ్యాట్లను కూడా ఇవి కలిగి ఉంటాయి.
బరువు తగ్గేందుకు..
బరువు తగ్గాలనుకునే వారి వేరుశగనలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్ అధికం. కండలు పెరిగేందుకు, బరువు నియంత్రణలో ఉండేందుకు వేరుశనగలు సహకరిస్తాయి. ఇవి తింటే చాలాసేపటి వరకు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తాయి. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. క్యాలరీలు బర్న్ అయి బరువు తగ్గేందుకు వేరుశనగలు చాలా ఉపయోగపడతాయి.
గుండె ఆరోగ్యం
వేరుశనగల్లో ఉండే మోనో, పాలీసాచురేటెడ్ ఫ్యాట్స్.. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గేలా చేయగలవు. దీంతో గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది కూడా గుండెకు మంచి చేస్తుంది.
ఎముకల బలం
వేరుశనగల్లో పాస్ఫరస్, మ్యాగనీస్, కాల్షియం మెగ్నిషియం, పొటాషియం కూడా ఉంటాయి. అందుకే ఇవి తింటే ఎముకల దృఢత్వం అధికం అవుతుంది. శరీరంలో కణాల పెరుగులకు ఇవి సహకరిస్తాయి.
డయాబెటిస్ కోసం..
వేరుశనగల్లో గ్లెసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు కూడా వీటిని తినొచ్చు. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉండేలా ఇది తోడ్పడుతుంది. ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తుంది.
మెదడు, చూపు, చర్మానికి..
వేరుశనగల్లో ఉండే విటమిన్ బీ1 వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. ఇందులో ఉండే ఒమేగా యాసిడ్స్ వల్ల కంటి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. విటమిన్ ఈ వల్ల చర్మం మెరుగ్గా ఉంటుంది. చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గేలా వేరుశనగలు సహకరిస్తాయి.
ఇలా తినండి
ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కల్పించే వేరుశనగలను ప్రతీ రోజూ తినాలి. వేరుశనగలను వేయించి నేరుగా తినడం మంచిది. ఉడికించి కూడా తీసుకోవచ్చు. వంటకాల్లోనూ ఎక్కువగా వాడొచ్చు. వేయించిన వేరుశనగల పొడిని కూడా వంటల్లో వేయవచ్చు. మొలకెత్తించిన కూడా వేరుశనగలను తీసుకోవచ్చు.